డిప్యూటీ సీఎం రాజయ్య కార్యాలయం ఖాళీ!
* సీఎం ఆదేశంతో అధికారులందరి తొలగింపు
* డిప్యూటీ సీఎంకు దొరకని సీఎం అపాయింట్‌మెంట్
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో ప్రక్షాళనా కార్యాక్రమం కొనసాగుతోంది. వైద్యులు, పారామెడికల్ పోస్టుల భర్తీ అంశంలో అవకతవకల నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు అధికారులను తొలగించిన ప్రభుత్వం... తాజాగా ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం టి.రాజయ్య పేషీ అధికారులందరిపైనా వేటు వేసింది. ఓఎస్డీ గంగాధర్, పీఏ సాల్మన్‌రాజు, పీఆర్వోలు రఘునందన్, రవికుమార్ సహా సచివాలయంలోని ఈ కార్యాలయంలో పనిచేసే అధికారులను తొలగించింది. మొత్తం పేషీని ప్రక్షాళన చేయాలని హుకుం జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించడంతో ఉప ముఖ్యమంత్రి వారెవరినీ రావొద్దని ఆదేశాలిచ్చారు. దీంతో శనివారం ఒక అటెండర్ మినహా ఎవరూ లేక రాజయ్య కార్యాలయం బోసిపోయింది. ఆయన పక్కన రక్షణ సిబ్బంది మినహా ఇతర అధికారులెవరూ కనిపించలేదు. ఆయన ఒక్కరే తన కార్యాలయంలో కూర్చుండిపోయారు. ఈ సమయంలో ఎవరినీ కలవడానికి డిప్యూటీ సీఎం ఇష్టపడలేదు. హైటెక్స్‌లో జరిగిన యశోదా ఆసుపత్రి సదస్సుకు కూడా ఆయన సహాయకులు ఎవరూ రాలేదు.
వైద్య పోస్టుల భర్తీని అర్హతలేని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించడం, అవకతవకల ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించడం తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖలోని ఓఎస్డీలు, పేషీలోని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి శాఖను భ్రష్టుపట్టించారని ఇంటలిజెన్స్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఒకానొక సందర్భంలో ఒక ఓఎస్డీ ఏకంగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందాను కూడా నిలదీసే స్థాయికి.. ఆదేశాలచ్చే స్థాయికి వెళ్లినట్లు తేలింది. ఓఎస్డీలు శాఖలో తమ స్థాయిని మరిచి ఉన్నతాధికారులతో సమీక్షలు చేయడం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతోపాటు ఒక కీలక నేత ఆదేశాలకు అనుగుణంగా పేషీలోని ఆయన అంతరంగీకులు వసూళ్ల పర్వం మొదలుపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
కోరినా.. దొరకని అపాయింట్‌మెంట్
దాదాపు రోజంతా సచివాలయంలోని తన కార్యాలయంలోనే ఉండిపోయిన ఉప ముఖ్యమంత్రి రాజయ్య... సీఎం కేసీఆర్‌ను కలవడానికి రెండు మూడు సార్లు ప్రయత్నించారు. రెండు సార్లు ‘సి’ బ్లాక్ వద్దకు వచ్చారు. కానీ సీఎం బిజీగా ఉన్నారని ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. మరోవైపు రాజయ్యను కలవడానికి ఆ శాఖ అధికారులెవరూ కూడా రాలేదని తెలిసింది. స్వైన్‌ఫ్లూపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో కనీసం ఆయన స్వైన్‌ఫ్లూపైనా ఎలాంటి సమీక్ష చేయలేదని సమాచారం. కానీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించడం గమనార్హం.