
రెండు రోజుల్లో పెళ్లి, ఆచూకీ లేని వరుడు
రెండు రోజుల్లో పెళ్లి. అయితే అమెరికా నుంచి రావాల్సిన వరుడు మాత్రం రాలేదు. ముహుర్తం దగ్గర పడుతున్నా అమెరికా నుంచి అబ్బాయి రాకపోవడంతో వధువు కుటుంబీకులు ఫోన్ చేశారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో వారిలో కలవరం మొదలైంది. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయినట్లే. అయితే తాళి కట్టాల్సిన వాడు మోసం చేయడంతో వధువు మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుంది.
వివరాల్లోకి వెళితే నిజామాబాద్కు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ నవదీప్ రాజు, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్కు చెందిన ఓ యువతితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతని సూచన మేరకు, మే 14వ తేదీ పెళ్లి ముహుర్తం పెట్టుకున్నారు. నిశ్చితార్ధం అయిపోయిన తరువాత ఉద్యోగం నిమిత్తం నవదీప్ రాజు అమెరికాకు వెళ్లిపోయాడు.
పెళ్లి ముహుర్తం దగ్గర పడుతుండటంతో అమ్మాయి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.. అమెరికా నుంచి రావాల్సినోడు ఇంకా రాకపోవడంతో .. పెళ్లిపీటలు ఎక్కాల్సిన అమ్మాయిలో టెన్షన్ మొదలైంది. మరో వైపు కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకున్న ఆ తండ్రి గచ్చిబౌలిలోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్లు చెదిరేలా గ్రాండ్గా ఏర్పాట్లు చేశాడు. అమెరికాలో ఉంటున్న అల్లుడు రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశాడు.
ఈ క్రమంలోనే వధువు ..కాబోయే భర్త కు ఫోన్ చేసింది.ఈ నేపథ్యంలో అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కట్టుకోవాల్సినోడు మోసం చేశాడని నమ్మిన ఆ వధువు సూసైడ్ లేఖ రాసి.., ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరోవైపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన అమ్మాయి ..ఆస్పత్రి పాలుకావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రూ. 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసి చివరి నిమిషం లో మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. కాగా నవదీప్ రాజుకు మరో యువతితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.