నేరస్తుల ‘టోలు’ తీస్తారు! | Offenders ' tolu ' taken ! | Sakshi
Sakshi News home page

నేరస్తుల ‘టోలు’ తీస్తారు!

Published Thu, Aug 4 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

నేరస్తుల ‘టోలు’ తీస్తారు!

నేరస్తుల ‘టోలు’ తీస్తారు!

►రాష్ట్రంలోని టోల్‌గేట్లన్న
►ఆన్‌లైన్‌లో అనుసంధానం
►‘టోల్ ఐ’ పేరుతో అప్లికేషన్ రూపొందిస్తున్న నగర పోలీసులు
►నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి ఉపయుక్తం

 
 మహానగరంలో అంతర్రాష్ట్ర, ఇతర జిల్లాల ముఠాలు చేసే నేరాలకు సంబంధించిన కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, ‘పొరుగు’ ప్రాంతాల నుంచి వచ్చే నేరస్తులను కట్టడి చేయడం.. చోరీకి గురైన వాహనాల ఆచూకీ త్వరగా కనుక్కోవడం.. ఈ లక్ష్యాలతో నగర పోలీసు విభాగం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ‘టోల్ ఐ’. రాష్ట్రంలోని అన్ని టోల్‌గేట్లను ఆన్‌లైన్‌లో అనుసంధానిస్తూ.. ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ఈ యాప్ త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.    - సాక్షి, హైదరాబాద్
 
కేసు

నగరంలో దోపిడీకి పాల్పడిన ఓ ముఠా వాహనంలో పారిపోతోంది. నగరమంతా జల్లెడపట్టినా ఆచూకీ చిక్కలేదు. అంతర్రాష్ట్ర ముఠాగా భావించిన పోలీసులు సిటీ సరిహద్దులు దాటిందని అనుమానించారు. వారు ఏవైపు వెళ్లారో తెలుసుకోవడానికి టోల్‌గేట్లే ఆధారం. ప్రస్తుతం నేరం జరిగిన పరిధిలోని ఠాణా పోలీసులు వ్యక్తిగతంగా ఆ టోల్‌గేట్స్‌కు వెళ్లి వివరాలు పరిశీలించాల్సిందే. దీనివల్ల కాలయాపన జరగడంతో నేరగాళ్లు సేఫ్‌డెన్‌కు చేరుకోవడంతో పాటు చోరీ సొత్తును మాయం చేస్తుండటంతో కేసులు కొలిక్కి రావడంలేదు.
 
పరిష్కారం
‘టోల్ ఐ’ అమలులోకి రావడంతో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నేరం జరిగిన ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షుల ద్వారా లేదా ఆయా చోట్ల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నేరగాళ్ల వాహనం నంబర్ గుర్తించే వీలుంది. కేసు దర్యాప్తు అధికారులో, కంట్రోల్ రూమ్ సిబ్బందో ‘టోల్ ఐ’లో వాహనం నంబర్ ఎంటర్ చేస్తే చాలు. నేరగాళ్ల వాహనం రాష్ట్రంలోని ఏ టోల్‌గేట్ నుంచైనా ప్రయాణిస్తే వెంటనే గుర్తిస్తుంది. ఆ విషయాన్ని అలెర్ట్ రూపంలో పోలీసులతో పాటు కం ట్రోల్ రూమ్ సిబ్బందికీ సమాచారం ఇస్తుంది. దీంతో వాహనం ప్రయాణిస్తున్న మార్గంలోని పోలీసుస్టేషన్‌కు సమాచారమివ్వడం ద్వారా నేరగాళ్లను పట్టుకోవచ్చు.
 
కేసు
పాతబస్తీలో భారీ చోరీకి పథకం వేసిన ఓ అంతర్రాష్ట్ర/జిల్లా ముఠా అక్కడ నుంచి బయలుదేరింది. ద్విచక్ర వాహనం లేదా తేలికపాటి వాహనంలో వస్తున్న గ్యాంగ్ మెంబర్లు.. తాము వినియోగిస్తున్న వాహనానికి ఇతర వాహనానిదో, బోగస్ నంబరో వేసి ప్రయాణించారు. నేరం చేసిన తర్వాత చేపట్టే దర్యాప్తులోనే తప్పుడు నంబర్ ప్లేట్‌తో వచ్చారని తేలుతోంది. ఫలితంగా నేర నిరోధం సాధ్యం కాకపోగా.. కేసు దర్యాప్తు క్లిష్టంగా మారుతోంది.
 
 పరిష్కారం
ఇలాంటి సవాళ్లకూ ‘టోల్ ఐ’నే సమాధానం. నగర పోలీసులు ఈ సర్వర్‌కు ఆర్టీఏ డేటాబేస్‌ను సైతం అనుసంధానిస్తున్నారు. ఫలితంగా ఓ రకం వాహనానికి(టూ వీటర్) మరో రకం వాహనానికి(లారీ) చెందిన నంబర్ ఉంటే సర్వర్ గుర్తిస్తుంది. ఫలానా వాహనం, దొంగ నంబర్‌తో ఫలానా టోల్‌గేట్ దాటి వస్తోందని హెచ్చరిస్తుంది. వాళ్లు వస్తున్న మార్గంపై దృష్టిసారించి పట్టుకోవడం ద్వారా నేరాలు నిరోధించవచ్చు.

మరిన్ని హంగులతో..
 →పస్తుతం టోల్‌గేట్లను మాత్రమే అనుసంధానించారు. ఇంటర్‌నెట్ సమస్య కారణంగా ఔటర్ రింగ్ రోడ్‌పై ఉన్న టోల్‌ప్లాజాల అనుసంధానంసాధ్యం        కావట్లేదు. దీంతో ప్రతి రెండు గంటలకు ఓసారి వారి డేటా అప్‌లోడ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.
నగరంలో చోరీకి గురైన వాహనాలకు సంబంధించిన స్టోలెన్ వెహికిల్ డేటాబేస్‌ను సైతం ‘టోల్ ఐ’ సర్వర్‌తో అనుసంధానించనున్నారు. ఫలితంగా  ఆ వాహనం రాష్ట్రంలోని ఏ టోల్‌గేట్‌ను దాటినా వెంటనే అప్రమత్తం చేస్తుంది.
అప్లికేషన్ రూపంలో ఉన్న ‘టోల్ ఐ’ని యాప్ రూపంలోకి మార్చనున్నారు. ప్రస్తుతం దర్యాప్తు తదితరాల కోసం నగర పోలీసులు వినియోగిస్తున్న ‘హైదరాబాద్ కాప్’తో దీన్ని లింక్ చేస్తారు.
 →టోల్‌గేట్ల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టంతో కూడిన కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తారు. ఫలితంగా టోల్‌గేట్ నిర్వాహకులతో సంబంధం లేకుండానే ‘ఆపరేషన్’ నడుస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement