సాక్షి, నాగర్‌కర్నూల్: పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాచాటిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్లో అపజయాన్ని చవిచూసిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం చేయడం వల్లే ఓటమి చెందడానికి ఒక కారణమని ఏఐసీసీ దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. టీఆర్‌ఎస్ సైతం అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగించాలన్న ఉద్దేశంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ముందుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలలోని నేతల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను సమీక్షించి సమన్వయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ ముందస్తు వ్యూహం..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతె కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు నేతలతో పాటు పార్టీ సీనియర్ నేతలు లోక్‌సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుసమాచారం. మహబూబ్‌నగర్ స్థానానికి మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి డీకే అరుణ, రేవంత్‌రెడ్డి పోటీలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండగా, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, వంశీచంద్‌రెడ్డి కూడా బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానాన్ని వరుసగా రెండు పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ వరుసగా కైవసం చేసుకుంది. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య వయోభారం వల్ల మళ్లీ పోటీలో ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మల్లురవితో పాటు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సతీష్ మాదిగ, డాక్టర్ అనురాధ, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ చెన్నయ్య తదితరులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ) ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నాగర్‌కర్నూల్ స్థానానికి 36 మంది, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు 11మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం కొల్లాపూర్‌లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవాలంటే బలమైన నేతలనే రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతి పార్లమెంట్ స్థానానికి ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి షార్ట్‌లిస్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపనున్నట్లు తెలిసింది. ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ప్రజల్లోకి వెళ్లాలనే ముందస్తు వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది.
టీఆర్‌ఎస్ కసరత్తు
పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ కసరత్తు ప్రారంభించింది. గెలుపే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటినట్లుగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో విజయం సాధించి తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ముందుగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించడంతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గంలో విభేదాలున్న నేతల మధ్య సమన్వయం కుదర్చడంపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.
ఈనెల 6వ తేదీన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం వనపర్తిలో నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మహబూబ్‌నగర్ పార్లమెంట్ ని యోజకవర్గ సన్నాహక సమావేశం ఈనెల 11న మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తారు. ఈ రెండు సమావేశాలు కూడా మంత్రుల నేతృత్వంలో నిర్వహించనున్నారు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ సన్నాహక సమావేశం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో, మహబూబ్‌నగర్ సన్నాహక సమావేశం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. రెండు సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం
పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ఈవీఎం, వీవీ ప్యాట్‌లను సిద్ధం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల తనిఖీ, ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సిద్ధం చేశారు. నాగర్‌కర్నూల్‌కు సంబంధించి సోమవారం కలెక్టర్ శ్రీధర్ 15బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, నోడల్ అధికారులను నియమించారు. మరోవైపు మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణకు ఢిల్లీ వెళ్లి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment