ఒగ్గు కళాకారుడు మల్లయ్య కన్నుమూత
హైదరాబాద్: ఒగ్గు కళకు జీవం పోసి, పాటే ప్రాణంగా బతికిన దేవుని మల్లయ్య(62) (అచ్చన మల్లయ్య) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ముకునూర్‌లో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. చిన్నప్పటి నుంచి ఒగ్గు కళతో అచ్చన మల్లయ్య గుర్తింపు పొందారు. తెలంగాణ ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఒగ్గు కళాకారుడుగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒగ్గు కళాకారుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు చేశారు. ప్రభుత్వంతో పోరాడి దాదాపు 3,000 మందికి పింఛన్ అందేలా కృషి చేశారు. కాగా, మల్లయ్య అంత్యక్రియలు గురువారం సాయంత్రం నిర్వహించారు. మల్లయ్య మరణం తీరని లోటని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, జెడ్‌పీటీసీ సభ్యుడు పొట్టి అయిలయ్య, కళాకారులు, ప్రజలు నివాళులు అర్పించారు.