సాక్షి, జనగామ: ఒగ్గుకథ పితామహుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత చుక్క సత్తయ్య కన్నుమూశారు. జానపద కళారూపమైన ఒగ్గు కథ చెప్పడంలో చుక్క సత్తయ్య ప్రవీణుడు. జిల్లాలోని లింగాల ఘణపురం మండలం మాణిక్యపురం గ్రామాంలో ఓ సామాన్య కుటుంబానికి చెందిన ఆయన ఒగ్గు కథకు వన్నె తెచ్చారు. దేశవ్యాప్తంగా ఒగ్గు కథకు పేరు తెచ్చిన ఆయన రాష్ట్రపతి అవార్డుతో పాటు ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్తయ్య గురువారం తన ఇంట్లో తుది శ్వాసవిడిచారు.
ఒగ్గు కథా గాన శైలిలో అనేక సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన పోరాటం చేశారు. ఉన్నత విద్య, ఫ్యామిలీ ప్లానింగ్, కట్న వ్యవస్థ, మూఢనమ్మకాలు, చెడు అలవాట్ల లాంటిపైన కూడా ఆయన ఒగ్గు కథతో ప్రదర్శనలు చేశారు. జనగామ కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళా సమితిని ఏర్పాటు చేశారు. ఒగ్గుకథ, ఒగ్గు డొళ్లు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు.
కాగా చుక్కా సత్తయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సత్తయ్య తెలంగాణతో పాటు దేశం గర్వించదగ్గ కళాకారుడని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు అని పేర్కొన్నారు. సత్తయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment