
నీరాజనం
రెండోరోజు షర్మిల పరామర్శ యాత్ర
వెళ్లిన ప్రతిచోటా ఆత్మీయ పలకరింపు
దారిపొడవునా పూలవర్షంతో కురిపిస్తూ ఘనస్వాగతం
రాజన్న కుటుంబం ఉందంటూ భరోసా
మహబూబ్‌నగర్: ఏ పల్లెకు వెళ్లినా వైఎస్ షర్మిలకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఆమెను చూసేందుకు, ప్రసంగం వినేందుకు పార్టీలకతీతంగా ముఖ్యకూడళ్ల వద్దకు తరలొస్తున్నారు. మార్గమధ్యంలో పూల వర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. రాజన్న బిడ్డగా, జగనన్న చెల్లిగా వచ్చిన ఆమెపై ప్రేమాభిమానాలు చూపుతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో గుండెచెదిరి మరణించిన ముగ్గురి కుటుంబాలను వైఎస్ షర్మిల మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రాజన్న కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసాఇచ్చారు. వెళ్లిన ప్రతిచోటా కుటుంబంలో ఒకరిలా కలిసిపోయి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్న తీరుతో ఆయా కుటుంబాల సభ్యుల కళ్లు చెమర్చాయి. కుటుంబ సభ్యుల్లో ప్రతిఒక్కరినీ పలుకరిస్తూ కుటుంబసభ్యులను కోల్పోయిన వారి ఆవేదనను తెలుసుకుంటున్నారు. వైఎస్ కుటుం బంతో వారికి పెనవేసుకున్న మానసికబంధాన్ని చూసి షర్మిల శిరసు వంచి నమస్కరిస్తున్నారు. పరామర్శయాత్రలో భాగంగా వెళ్లిన ప్రతిచోటా షర్మిలకు స్థానికులు ఘనస్వాగతం పలుకుతున్నారు. వైఎస్ కూతురు, జగన్ సోదరి వస్తుందంటూ మహిళలు, వృ ద్ధులు, గ్రామీణులు పెద్దఎత్తున గుమికూడుతున్నారు. పరామర్శయాత్ర మార్గంలో ఎదురైన వారిని చిరునవ్వుతో పలుకరిస్తూ రెండు చేతు లు జోడించి అభివాదం చేస్తూ షర్మిల ముందుకు కదులుతున్నారు. యాత్ర రెండో రోజు రంగాపూర్‌లో గిరిజనులు, అచ్చంపేట శివారులో గిరిజనులతో షర్మిల ముచ్చటించి వారి అభిమానానికి ముగ్ధులయ్యారు. మార్గమధ్యంలో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ యాత్ర ముందుకు సాగింది.
మూడు కుటుంబాలకు పరామర్శ
పరామర్శ యాత్ర రెండోరోజు షర్మిల మూడు కుటుంబాలను కలుసుకుని వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కల్వకుర్తి నుంచి ఉదయం 9.30 గంట లకు బయలుదేరిన ఆమె డిండి, మన్ననూరు మీదుగా అమ్రాబాద్‌కు చేరుకున్నారు. అమ్రాబాద్‌లో పర్వతనేని రంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అమ్రాబాద్, అచ్చంపేటలో జనాన్ని ఉద్ధేశించి మాట్లాడారు. నాగర్‌కర్నూల్ మీదుగా కోడేరు మండలం ఎత్తం గ్రామానికి చేరుకున్నారు. వైఎస్ మరణవార్త విని గుండె చెదిరి మరణించిన పుట్టపాగ నర్సింహ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మంగళవారం రాత్రి కొల్లాపూర్ పట్టణానికి చేరుకుని కటికె రామచంద్రయ్య కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. రాజన్న కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆయా కుటుం బాలు గుర్తు చేసుకున్నాయి. ఒక్కో కుటుంబంతో షర్మిల గంటకు పైగా భేటీఅవుతూ వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. జిల్లాలో మరో మూడురోజుల పాటు జరిగే పరామర్శయాత్రలో షర్మిల 15 కుటుంబాలను పరామర్శించనున్నారు.