ఒకే రోజు కోటి మొక్కలు నాటుతాం
మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: ‘గత ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే వాతావరణం అనుకూలించక వీలు కాలేదు. ఈ ఏడాది వాతావరణం బాగా అనుకూలిస్తున్నందున, సీఎం నిర్ణయించిన తేదీన ఒకేరోజు కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.’ అని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక సారథి సమీక్షా సమావేశం, హరితహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ జూలై 2 నుంచి 15వ తేదీ వరకు హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో నిర్వహించాలన్నారు.
గతంలో 100 మొక్కలు నాటితే నిర్వహణ కోసం రూ.5 చొప్పున ఇచ్చేవారమని, ఇప్పుడు దానిని 50 మొక్కలకు కుదించాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ కళాకారులకు రూ.5 లక్షలు ఇన్సురెన్స్ ప్రవేశపెట్టామని, ఆరోగ్య బీమా కూడా ఇవ్వనున్నామని చెప్పారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ హరితహారం ప్రాధాన్యతను వివరించేందుకు సారథి కళాకారులను అన్ని జిల్లాకు పంపుతున్నామన్నారు. సభ ప్రారంభంలో సారథి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.