
ఆప్షన్లకు ఒప్పుకోం:దేవీప్రసాద్
టీ-ఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్
నల్లగొండ, న్యూస్‌లైన్: తెలంగాణలో ఈ ప్రాంత ఉద్యోగులే పనిచేయాలని, ఆప్షన్లంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని తెలంగాణ ఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. బుధవారం నల్లగొండలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల విభజనలో 58 : 42 నిష్పత్తిలో పంచుతామంటున్నారని, ఇలా చేస్తే, తెలంగాణ కార్యాలయాల్లో కేవలం 20 శాతం తెలంగాణ ఉద్యోగులు ఉంటారని, ఇటువంటి ప్రక్రియను సహించమన్నారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు కేవలం తెలంగాణ ప్రాంత ఉద్యోగులే పనిచేయాలన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలతో సహా, ఇతర పార్టీలకు చెందిన వాళ్లు ఆప్షన్ల విషయంలో తమ అభిప్రాయాలను వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్‌జీవో రాష్ట్ర జనరల్ సెక్రటరీ కారం రవీందర్‌రెడ్డి, మహిళా విభాగం చైర్‌పర్సన్ రేచల్, మందడి పేందర్‌రెడ్డి, బాణాల రాంరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పందిరి వెంకటేశ్వరమూర్తి, ఎ. వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.