మేడిపల్లి గ్రామంలో ఇంటి గోడ పగుళ్లుతేలడంతో కవర్ కప్పిన దృశ్యం
గోదావరిఖని(రామగుండం): ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో బ్లాస్టింగ్లతో గ్రామంలోని ఇళ్లు పగుళ్లు తేలాయి.. భూమి పొరల్లో కదలిక ఏర్పడి గ్రామంలోని బావుల్లో నీరు ఇంకిపోయింది.. రోడ్లు నెర్రెలు బారి నడిచేందుకు ఇబ్బందిగా మారాయి.’ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పరిహారం చెల్లించాలంటూ ఆదివారం సింగరేణి మేడిపల్లి ఓసీపీకి వెళ్లే రహదారిపై ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ధర్నా నిర్వహించారు. నెలక్రితం అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మరవడంతోనే ఆందోళన బాటపట్టినట్లు వారు స్పష్టం చేశారు.
ఇదీ పరిస్థితి..
సింగరేణి ఆర్జీ–1 డివిజన్ పరిధిలో 1994లో మేడిపల్లి గ్రామ శివారులో యాజమాన్యం ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. మేడిపల్లి, లింగాపూర్ గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. రెండు గ్రామాలకు చెందిన ఇళ్లనూ కొంత మేర స్వాధీనం చేసుకుంది. కొంతకాలానికి ఓపెన్‌కాస్ట్‌లో చేసే బ్లాస్టింగ్‌లకు మేడిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఇళ్లు బీటలు వారాయి. మున్సిపాలిటీ వేసిన రోడ్లు పగుళ్లు తేలాయి. దీంతో ఎస్సీ కాలనీవాసులు ఓపెన్‌కాస్ట్ పనులు బంద్ పెట్టే విధంగా ఆందోళన చేయడంతో సింగరేణి యాజమాన్యం దిగివచ్చి పరిహారం చెల్లించింది. ఎస్సీ కాలనీకి ఆనుకుని ఉన్న బీసీ కాలనీ ప్రజలను ఓసీపీలో చేసే బ్లాస్టింగ్ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
గ్రామంలో 220కి పైగా బీసీలకు చెందిన ఇళ్ల్లతో కాలనీ ఏర్పడింది. ఇందులో చాలా ఇళ్లు పగుళ్లు తేలాయి. గోడలు కూలిపోవడంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. చుట్టూ మట్టి కుప్పల కారణంగా దుమ్మూధూళీ ఇబ్బంది పెడుతోంది. కాలనీ వాసులు రోగాల బారినపడుతున్నారు. గ్రామస్తులు తాగడానికి, ఇతర అవసరాల కోసం బావుల్లో నీరు ఇంకిపోవడంతో సైకిళ్లపై ఎన్టీపీసీకి వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. తమను కూడా నిర్వాసితులుగా గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని, మేడిపల్లి గ్రామంలోని బీసీ కాలనీవాసులు గతంలో పలుమార్లు ఆందోళన చేపట్టారు. 2020 నాటికి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును యాజమాన్యం మూసివేస్తున్న నేపథ్యంలో తమకు పరిహారం చెల్లింపులు లేక అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామస్తులు ఆదివారం కూడా ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ధర్నాలో నాయకులు కోరుకంటి చందర్, మహాంకాళి స్వామి, వెంగల బాపు, ముసిపట్ల రాజు, మడ్డి అంబిక, రాజబాబు, పూసాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
బొగ్గు రవాణాకు ఆటంకం...
సింగరేణి మేడిపల్లి ఓసీపీ నుంచి ప్లేడే అయిన ఆదివారం రోజువారీగా నిర్ణయించిన 16 వేల టన్నుల బొగ్గు రవాణా కన్నా ఎక్కువగా 25 వేల నుంచి 30 వేల టన్నుల వరకు బొగ్గు రవాణా చేయాలని అధికారులు భావించారు. కానీ.. మేడిపల్లి గ్రామస్తులు ఉదయం 6 గంటలకే వచ్చి ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై బైఠాయించడంతో వందలాది మంది కార్మికులు విధులకు హాజరుకాకుండా నిలిచిపోయారు. జైపూర్ ఎస్టీపీపీ, శ్రీరాంపూర్, ఆర్జీ–1 సీఎస్‌పీ, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే దాదాపు 80 లారీలు 10 గంటల వరకు అక్కడే ఉండిపోయాయి. ప్రాజెక్టు అధికారి ఎం.నరేందర్, డిప్యూటీ మేనేజర్ పొనుగోటి శ్రీనివాస్ నిర్వాసితుల వద్దకు వచ్చి రెండు రోజుల్లో గ్రామానికి వచ్చి సమస్య తెలుసుకుంటామని, అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అంతర్గాం, ఎన్టీపీసీ ఎస్సైలు ప్రమోద్‌కుమార్‌రెడ్డి, చంద్రకుమార్ బందోబస్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment