మా నాలుగు ఊళ్లు మాకివ్వాల్సిందే..
* ఏపీలో విలీనమైన 4 పంచాయతీలను తెలంగాణలోనే ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ యత్నం
* కేంద్రానికి నివేదించిన సీఎం కేసీఆర్
* అవి తిరిగి వస్తేనే భద్రాచలానికి భవిష్యత్
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంపై మరోమారు ఢిల్లీ స్థాయిలో చర్చ సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు సమస్యలు తలెత్తుకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లటంతో భద్రాచలం అంశం మరోమారు తెరపైకి వచ్చింది.
భద్రాచలానికి ఆనుకుని ఉండి.. ఏపీలో విలీనమైన నాలుగు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్ ఢిల్లీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న భద్రాచలం నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మం డలాలకు వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ఆ నాలుగు పంచాయతీల మీదుగా వెళ్లాల్సి వస్తోందని.. ఇది భవిష్యత్‌లో తీవ్రమైన సరిహద్దు సమస్యగా మారే అవకాశం ఉందని తెలిపినట్లు సమాచారం.
భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవటం ద్వారా, పట్టణంలో అంతర్భాగంగా ఉన్న రాజుపేట కాలనీ లో ఓ భాగం, శ్రీరామ్‌నగర్ కాలనీ ఏపీలో విలీనమయ్యాయి. దీంతో ఇక్కడి ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతోంది. రాష్ట్రం విడిపోయి 16 నెలలు గడిచినా, తాము ఏ రాష్ట్రంలో ఉన్నామో ఆ కాలనీలవాసులకు తెలియని పరిస్థితి నెలకొంది.
కలిస్తేనే భవిష్యత్
ఏపీలో విలీనమైన ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకల పాడు, పురుషోత్తపట్నం పం చాయతీలు తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలిస్తేనే భద్రాచలానికి భవిష్యత్ ఉంటుంది. ప్రసిద్ధి చెందిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి చెం దిన 900 ఎకరాల భూమి ఆ నాలుగు పంచాయతీల్లో ఒకటైన పురుషోత్తపట్నంలోనే ఉంది. రాముడు తెలంగాణకు ఉంటే ఆస్తులన్నీ ఏపీలోకి పోయాయి. ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామాన్నే పరిగణనలోకి తీసుకోవడం ద్వారా కేవలం 2,067 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలింది.
ఈ భూముల్లో ఇప్పటికే భవనాల నిర్మాణం జరుగుతుండటంతో పట్టణంలో చెత్త డంపింగ్‌యార్డుకు అనువైన స్థలం కూడా లేదు. చెత్తను గోదావరి నదిలో పోయాల్సి వస్తోంది. ఆ నాలుగు పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకురావటం ద్వారా దుమ్ముగూడెం వైపునకు ఉన్న మండలాలకు సరిహద్దు సమస్యలు లేకుండా పోతాయి. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించటంపై హర్షం వ్యక్తమవుతోంది. ఆ నాలుగు పంచాయతీలు తిరిగి తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకురావటం సాధ్యమయ్యే పనేనా? అనే దానిపై చర్చ సాగుతోంది.
ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని ఒప్పందం చేసుకుంటే సాధ్యమేనని స్థానికులంటున్నారు. ఏపీలో విలీనమైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, నెల్లిపాక మండలాలకు ఎటపాకను డివిజన్ కేంద్రంగా ప్రకటించి, పాలన కూడా సాగుతున్న నేపథ్యంలో మరో అంశం కూడా తెరపైకి వస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని స్థానికులు ఆశిస్తున్నారు.