వైభవంగా శ్రీసీతారాముల కల్యాణం
అశేష భక్తులతో పులకించిన భద్రగిరి
భద్రాచలం: వేద పండితుల మంత్రోచ్ఛారణలు, విద్వాంసుల మంగళవాయిద్యాలు, అశేష భక్తకోటి జయజయధ్వానాల మధ్య.. భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా భద్రాచలం వచ్చి శ్రీసీతారాములవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. సీతారాముల కల్యాణ వైభోగాన్ని చూసి తరించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
శుక్రవారం వేకువజామున పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కొందరు భక్తులు గోదావరి తీరాన తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాన ఆలయంలో మూలవిరాట్టులను దర్శించుకుని మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు శ్రీసీతారాముల కల్యాణ వేడుకను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తం గా జరిపించారు. ఆ కమనీయ ఘట్టాన్ని చూసిన భక్తజనం జైశ్రీరామ్ అని నినాదాలు చేస్తూనే ఉన్నారు. కల్యాణం అనంతరం భద్రాద్రి ఆలయ విశిష్టత, వైకుంఠ రాముని ప్రాశస్త్యాన్ని, భక్త రామదాసు సేవలను, ఆయన సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల ప్రాశస్త్యాన్ని వేద పండితులు చెప్పిన తీరు ఆకట్టుకుంది. కల్యాణోత్సవంలో సీఎంతో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల, మాజీ ఎంపీ బలరాంనాయక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
నేడు శ్రీరామ మహా పట్టాభిషేకం
భద్రాచలంలోని మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న కల్యాణ మండపంలో శనివారం శ్రీరామ మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఈ వేడుక జరగనుంది. ఈ పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ నరసింహన్ హాజరై.. భద్రాది రామచంద్రమూర్తికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.