భూ క్రమబద్ధీకరణపై ప్రభుత్వానికి చిక్కొచ్చిపడింది. నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోకపోతే, స్థలాలను స్వాధీనం చేసుకుంటామని కొందరు రెవెన్యూ అధికారులు జారీచేసిన...
కబ్జాదారులకు నోటీసులపై ప్రభుత్వం సీరియస్ క్రమబద్ధీకరణపై ఉన్నతస్థాయి సమీక్ష అధికారుల తీరుపై అసంతృప్తి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూ క్రమబద్ధీకరణపై ప్రభుత్వానికి చిక్కొచ్చిపడింది. నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోకపోతే, స్థలాలను స్వాధీనం చేసుకుంటామని కొందరు రెవెన్యూ అధికారులు జారీచేసిన నోటీసులు కొత్త వివాదానికి దారితీశాయి. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లోని నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసుకోవడానికి వీలు క ల్పిస్తూ జారీచేసిన 58, 59 జీఓలపై ఇప్పటికే హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కబ్జాదారులకు తాజాగా తహసీల్దార్లు పంపిణీ చేసిన తాఖీదులపై కూడా కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకున్నా అత్యుత్సాహం ప్రదర్శించిన తహసీల్దార్ల వ్యవహారశైలిపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.
మంగళవారం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీ.ఆర్.మీనా, కలెక్టర్ రఘునందన్‌రావు సమక్షంలో జరిగిన సమావేశంలో సరూర్‌నగర్ ఆర్డీఓ యాదగిరిరెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లును ఈ వ్యవహారంపై ఆరా తీసింది. తాఖీదులెందుకు ఇవ్వాల్సివచ్చిందని.. నోటీసులతో న్యాయపరమైన తలనొప్పులు వస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నించినట్లు సమాచారం.
ప్రభుత్వం కల్పించిన క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకోవాలనే సదుద్దేశంతోనే నోటీసులిచ్చాం తప్ప.. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, జీఓ 59 చెల్లింపు కేటగిరీ కింద ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడంలేదని, ఈ అంశంపై ఏం చేస్తే బాగుంటుందో సూచించాలని పేర్కొన్నట్లు సమాచారం.