మధ్యవర్తిత్వాన్ని వృత్తిగా ఎంచుకోండి | Outstanding opportunities for well-trained brokers | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వాన్ని వృత్తిగా ఎంచుకోండి

Published Fri, Jul 3 2015 12:21 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

Outstanding opportunities for well-trained brokers

* హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ బొసాలే
* సుశిక్షితులైన మధ్యవర్తులకు అద్భుత అవకాశాలు

సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వాన్ని (మీడియేషన్) వృత్తిగా ఎంచుకుంటే భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని, ఈ వృత్తిని ఎంచుకున్నవారికి రానున్న ఆగస్టు నుంచి విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉంటాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అన్నారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల న్యాయసేవా సాధికార సంస్థ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్)ల ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని, మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించవచ్చని ఆయన చెప్పారు. రెండు నెలల్లో హైకోర్టులో మీడియేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, రెండు రాష్ట్రాల్లో మధ్యవర్తిత్వ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ఏ తరహా కేసులను మీడియేషన్ కేంద్రాలకు సిఫార్సు చేయాలనేదానిపై న్యాయమూర్తులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు జస్టిస్ బొసాలే చెప్పారు. కర్ణాటకలో మొదట మీడియేషన్ ద్వారా కేవలం 5 శాతం కేసులను మాత్రమే పరిష్కరించేవారని, ప్రస్తుతం దేశానికే ఆదర్శంగా అక్కడి మీడియేషన్ కేంద్రాలు పనిచేస్తూ 65 శాతం కేసులను పరిష్కరిస్తున్నాయని తెలిపారు. కక్షిదారుని దగ్గరికే శిక్షణ పొందిన మీడియేటర్ వెళ్లాలని, అప్పుడే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.   

మధ్యవర్తిత్వం విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మధ్యవర్తిత్వంపై శిక్షకురాలు తనూమెహతా అద్భుతంగా శిక్షణ ఇచ్చి మంచి సుశిక్షితులైన మధ్యవర్తులుగా తయారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసీఏడీఆర్ కార్యదర్శి జీఎల్‌ఎన్ మూర్తి, ముంబైకి చెందిన మధ్యవర్తిత్వ శిక్షణ నిపుణుడు కరాచీవాలా, న్యాయవాదులు ఐవీ.రాధాకృష్ణమూర్తి, మహేష్‌రాజే, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement