ICADR
-
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయ పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆర్బిట్రేటరీ (న్యాయ వివాదాలకు మధ్యవర్తిత్వం) వ్యవస్థతో వేగంగా న్యాయవివాదాల పరిష్కారం సాధ్యమవుతుందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ (ఐసీఏడీఆర్) రీజినల్ ఇన్చార్జి జేఎల్ఎన్ మూర్తి అన్నారు. ప్రత్యామ్నాయ న్యాయవివాదాల పరిష్కారాలపై ఇంజినీర్లకు అవగాహన కల్పించేందుకు ఎర్రమంజిల్‌లోని ఈఎన్సీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ఆయన ప్రసంగించారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ వినోభా దేవి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేఎల్ఎన్ మూర్తి స్వాగతోపాన్యాసం చేస్తూ.. ఆర్బిట్రేటరీలతో ఉన్న ప్రయోజనాలను వివరించారు. రూ.40 లక్షల్లోపు విలువైన పనులకు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించవచ్చని తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడాన్ని ఆయన స్వాగతించారు. ఇంజినీరింగ్ పనుల్లో జాప్యం నివారించి, అభివృద్ధి వేగిరపరిచేలా ఆర్బిట్రేటరీ దోహదపడుతుందన్నారు. కేసుల ఆధారంగా సంబంధిత రంగంలో నిపుణులైన వ్యక్తులు (మెడికల్, ఇంజనీరింగ్, సీఏ, ఫైనాన్స్) కేసులు వాదించడంతో సత్వర పరిష్కారం దొరికేందుకు వీలు చిక్కుతుందన్నారు. నచ్చిన సమయంలో, నచ్చిన వేదిక, నచ్చిన భాషను జడ్జిని ఎంచుకునే వీలు ఉండటం దీని ప్రత్యేకత అని వివరించారు. ఆగ్నేసియా దేశాలైన సింగపూర్, మలేసియా ఆర్థికాభివృద్ధిలో ఆర్బిట్రేటరీ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. 1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన వ్యవస్థకు ప్రధాని మోదీ ఇటీవల చేసిన చట్టసవరణల ద్వారా ఆర్బిట్రేటరీ ద్వారా సులువుగా, వేగంగా జాతీయ, అంతర్జాతీయ న్యాయవివాదాలు సమసిపోతున్నాయన్నారు. మనరాష్ట్రంలోకూడా పలు కేసుల శీఘ్ర పరిష్కారానికి పలువురు ఆర్బిట్రేటరీని ఆశ్రయిస్తున్నారని వెల్లడించారు. గృహహింస, వరకట్న వేధింపులు, కుటుంబ పరమైన వివాదాలు, పలు ఇతర ఐపీసీ కేసులను అంతర్జాతీయ ప్రత్యామ్నాయ న్యాయ వివా దాల పరిష్కార వేదిక (ఐసీఏడీఆర్) వేగంగా పరిష్కరిస్తుందన్నారు. అనంతరం మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథలో తలెత్తే వివాదాలపై ఇంజనీర్లకు అవగాహన కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
మధ్యవర్తిత్వాన్ని వృత్తిగా ఎంచుకోండి
* హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ బొసాలే * సుశిక్షితులైన మధ్యవర్తులకు అద్భుత అవకాశాలు సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వాన్ని (మీడియేషన్) వృత్తిగా ఎంచుకుంటే భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని, ఈ వృత్తిని ఎంచుకున్నవారికి రానున్న ఆగస్టు నుంచి విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉంటాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల న్యాయసేవా సాధికార సంస్థ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్)ల ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని, మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించవచ్చని ఆయన చెప్పారు. రెండు నెలల్లో హైకోర్టులో మీడియేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, రెండు రాష్ట్రాల్లో మధ్యవర్తిత్వ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఏ తరహా కేసులను మీడియేషన్ కేంద్రాలకు సిఫార్సు చేయాలనేదానిపై న్యాయమూర్తులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు జస్టిస్ బొసాలే చెప్పారు. కర్ణాటకలో మొదట మీడియేషన్ ద్వారా కేవలం 5 శాతం కేసులను మాత్రమే పరిష్కరించేవారని, ప్రస్తుతం దేశానికే ఆదర్శంగా అక్కడి మీడియేషన్ కేంద్రాలు పనిచేస్తూ 65 శాతం కేసులను పరిష్కరిస్తున్నాయని తెలిపారు. కక్షిదారుని దగ్గరికే శిక్షణ పొందిన మీడియేటర్ వెళ్లాలని, అప్పుడే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మధ్యవర్తిత్వంపై శిక్షకురాలు తనూమెహతా అద్భుతంగా శిక్షణ ఇచ్చి మంచి సుశిక్షితులైన మధ్యవర్తులుగా తయారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసీఏడీఆర్ కార్యదర్శి జీఎల్ఎన్ మూర్తి, ముంబైకి చెందిన మధ్యవర్తిత్వ శిక్షణ నిపుణుడు కరాచీవాలా, న్యాయవాదులు ఐవీ.రాధాకృష్ణమూర్తి, మహేష్రాజే, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.