అమ్మో డబ్బా! | Paint Box Blast in Meerpet Hyderabad | Sakshi
Sakshi News home page

అమ్మో డబ్బా!

Published Sat, Nov 9 2019 8:22 AM | Last Updated on Sat, Nov 9 2019 1:13 PM

Paint Box Blast in Meerpet Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘పేలుడు’.. చిన్నదైనా, పెద్దదైనా ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఇటీవల రాజధాని నగరంలో తరచుగా చిన్నస్థాయి పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. అత్యధిక ఉదంతాల్లో క్షతగాత్రులే ఉండగా కొన్ని సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ బ్లాస్ట్‌లకు ప్రధానంగా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే ‘ఆర్గానిక్‌ సాల్వెంట్స్‌’ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మిళిత పదార్థాలు ఉండే పెయింట్స్‌ను కొన్ని స్థితుల్లో ఇళ్లల్లో పెట్టుకోవడం ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం మీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ తరహా ఆర్గానిక్‌ సాల్వెంట్‌ పేలుడులో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. నగరంలో చోటు జరుగుతున్న చిన్న స్థాయి పేలుళ్లకు ఎక్కువగా పెయింట్‌ డబ్బాలే కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రంగుల్లో వాడే థిన్నర్లలో ‘వలటైల్‌ ఆర్గానిక్‌ సాల్వెంట్స్‌’గా పిలిచే ఎసిటోన్, ఈ రసాయనం కలిపిన టాల్విన్, ఈథర్‌ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఓ పెయింట్‌ డబ్బా సీల్‌ తెరిచిన తర్వాత సగం వినియోగించి మిగిలిన సగాన్ని మూతపెట్టి అలాగే ఉంచడం పరిపాటి. ఇలా దాచి పెట్టే డబ్బాల్లో ఉండే రంగుల్లోని ఆవిరి స్వభావం కలిగిన రసాయనాలు.. డబ్బాలోని ఆక్సిజన్‌తో కలిసి వ్యాకోచించేందుకు ప్రయత్నిస్తాయి. గట్టిగా మూత పెట్టి ఉండటంతో అది సాధ్యంకాక డబ్బా లోపలి భాగంలో వాక్యూమ్‌ ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఉన్న డబ్బా మూతలు సైతం బిగుసుకుపోతాయి. అలాంటి వాటిని తెరవడానికి రాపిడి కలిగించినా, గట్టిగా కొట్టినా చిన్నస్థాయి పేలుడు సభవిస్తుంది. 

వారే ఎక్కువ మంది బాధితులు  
ఇలాంటి డబ్బాల పేలుడులో క్షతగాత్రులు, మృతులుగా మారుతున్న వారిలో ఎక్కువగా చెత్త ఏరుకునే వారే ఉంటున్నారు. మొన్నటి రాజేంద్రనగర్‌ ఘటన, తాజాగా మీర్‌పేట ప్రమాదం ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. సగం వాడిన పెయింట్‌ డబ్బాలను సాధారణంగా ఆ వినియోగదారులు కొన్నిరోజుల పాటే భద్రపరుస్తుంటారు. డబ్బా తుప్పు పడుతున్నప్పుడో, కదిల్చినప్పుడు పెయింట్‌ కదలిక లేకున్నా గడ్డ కట్టేసిందనో, మూత తీయడం సాధ్యం కానప్పుడో వాటిని బయట ఎక్కడో పారేస్తుంటారు. అలా అవి చెత్త ఏరుకునేవారు తీసుకుని వాటిని తెరిచే ప్రయత్నాలు చేసే క్రమంలో పేలుడు జరిగి కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. 

ప్లాస్టిక్‌ డబ్బాలతో మరింత ప్రమాదం
గతంలో పెయింట్స్‌ను ఇనుప డబ్బాల్లో ఉంచేవారు. అయితే ఇటీవల దాదాపు అన్ని రకాల రంగులను ప్లాస్టిక్‌ డబ్బాల్లోనే ఉంచి విక్రయిస్తున్నారు. ఇనుప వాటి కంటే ఇవి అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. సగం ఖాళీ అయిన ఇనుప డబ్బాలోని రంగుకు ఆక్సిజన్‌ అందక రసాయన క్రియ జరగదు. కేవలం గడ్డ కట్టడం మాత్రమే జరుగుతుంది. అదే ప్లాస్టిక్‌ డబ్బాలో ఉంటే ఉన్న చిన్నపాటి సందుల నుంచి ఆక్సిజన్‌ వెళ్తుంది. దీంతో పాటు ఆర్గానిక్‌ సాల్వెంట్స్‌ కొన్ని రోజులకు ప్లాస్టిక్‌తో కలిసి పాలిమరైజేషన్‌ జరుగుతుంది. ఈ కారణంగా ఏర్పడే వేఫరైజర్ల కారణంగా దాన్ని తెరిచే ప్రయత్నం చేసినప్పుడు పేలుడు జరిగే ప్రమాదముంది. ఇలాంటి డబ్బాలు ఇంట్లో ఉన్నప్పటికీ ప్రమాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

సీల్‌ తీస్తే వాడేయాలి
ఆర్గానిక్‌ సాల్వెంట్స్‌ ఉండే పెయింట్స్‌ను డబ్బా సీల్‌ తీసిన తర్వాత పూర్తిగా వాడేయడం ఉత్తమం. అలా కాకుండా కొంత మిగిలితే బయట పారబోయాలి. తర్వాత వినియోగిద్దామనే ఉద్దేశంతో దాచి పెట్టినా, కొన్నాళ్లకు పారేసినా ప్రమాదాలకు ఆస్కారముంటుంది. ఇలాంటి డబ్బాలు అన్ని సమయాల్లోనే పేలేకపోవచ్చు. పేలుడుకు అవసరమైన స్థాయిలో సాల్వెంట్స్‌ రేషియో తయారైతేనే అలా జరుగుతుంది. ఒకవేళ ఇలా సగం ఖాళీ అయిన డబ్బాలు ఇంట్లో తెరవాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వాటిని తెరవకుండా కనీసం గంట సేపు చల్లని నీటిలో ఉంచాలి. ఫ్రిజ్‌ వాటర్‌ను బక్కెట్‌లో పోసి అందులో ఈ డబ్బాలను వేయాలి. ఇలా చేస్తే అందులో ఉన్న ఆవిరి చల్లబడి మళ్లి పెయింట్‌గా మారుతుంది. అప్పుడు రాపిడి కలిగిస్తూ తెరిచినా ఎలాంటి ప్రమాదం ఉండదు.– డాక్టర్‌ ఎన్‌.వెంకన్న, హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్,హైదరాబాద్‌ క్లూస్‌ టీమ్స్‌ 

ఈ ఏడాది జరిగిన ఉదంతాలివీ..
మీర్‌ పేట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని జిల్లెలగూడ పోష్‌ కాలనీలో శుక్రవారం చెత్త ఏరుకునే నిర్మల ప్లాస్టిక్‌ డబ్బాను తెరిచే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడింది.  
ఆక్టోబర్‌ 19: నాచారంలో చేతితో ఆడుకుంటున్న రసాయనంతో కూడిన డబ్బా పేలడంతో ఓ చిన్నారికి గాయాలయ్యాయి.  
సెప్టెంబర్‌ 8: రాజేంద్రనగర్‌లో టిన్‌ పేలి అలీ అనే వ్యక్తి మరణించాడు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పిల్లర్‌ నెం.279 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement