
బడ్జెట్‌లో పాలమూరుకు పెద్దపీట
* కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాలకు తొలి ప్రాధాన్యమివ్వాలని సర్కారు యోచన
* మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మార్చిలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యమిచ్చేలా నీటి పారుదల శాఖ కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. కృష్ణా జలాలను కేటాయింపుల మేర వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారని, దానికి ప్రధాన కారణం పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోవడమేనని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం ఇచ్చి అవసరమైన కేటాయింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిని పూర్తి చేయడం ద్వారా వచ్చే ఖరీఫ్ నాటికే సుమారు 3లక్షల ఎకరాలకు,ఆపై వచ్చే ఆర్ధిక ఏడాదికి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అధికారులతో కలిసి మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై సమీక్షించిన మంత్రి టి.హరీశ్‌రావు ప్రభుత్వ ఆలోచనను స్పష్టం చేసినట్లు తెలిసింది.
వచ్చే ఏడాదికి సుమారు 6లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం..
పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాదే 80శాతంపైగా పనులు జరిగిన పాలమూరు ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. జిల్లాలోని నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు రూ.312 కోట్లను కేటాయించింది. అయితే భూసేకరణ చట్టానికి తుది రూపు రావడంలో జరిగిన జాప్యంతో ఎక్కడా ప్రాజెక్టు పనులు ముందుకు కదల్లేదు. దీనికి తోడు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు ఎస్కలేషన్ ఛార్జీలు పెంచే వరకు పనులు చేసేది లేదని భీష్మించడం వల్ల కూడా పనులు మందగించాయి. నాలుగు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సుమారు 3 లక్షల ఎకరాలకైనా సాగునీటిని అందించాలని లక్ష్య సాధ్యపడలేదు.
ప్రస్తుతం భూసేకరణ చట్టం మార్గదర్శకాలు ఖరారు కావడం, భూ పరిహారం విషయంలో స్పష్టత వచ్చిన దృష్ట్యా ఈ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్‌రావు సైతం నెల రోజుల వ్యవధిలో మూడుమార్లు జిల్లా పర్యటనలు చేసి అధికారులతో సమీక్షించారు. తాజాగా ప్రాజెక్టుల పురోగతిని ప్రశ్నిస్తూ బీజేపీ నేత నాగం జనార్ధన్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో శుక్రవారం మరోమారు మంత్రి పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. జిల్లా ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం సహకరిస్తుందనీ, సుమారు రూ.500 కోట్ల కేటాయింపులకు సిద్ధంగా ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. పనులు వేగిర పరిచేలా అధికారులకూ సూచించినట్లు తెలుస్తోంది.
పాలమూరు ఎత్తిపోతలకు రూ.1500 కోట్లు..
ప్రభుత్వం కొత్తగా చేపట్టాలని నిర్ణయించి 14,350 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి తొలి ఏడాదే రూ.1500 కోట్ల మేర కేటాయింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రాజెక్టుకు రూ.3వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు పంపగా వాటిలో సగం ఇచ్చేందుకు ఆర్ధిక శాఖ సమ్మతి తె లిపినట్లుగా తెలిసింది. శుక్రవారం నాటి సమీక్షలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.