మిషన్ కాకతీయతో శాశ్వత కరువు నివారణ : మంత్రి జూపల్లి
కొల్లాపూర్ రూరల్: రెండోవిడత మిషన్ కాకతీయ పనులకు జిల్లావ్యాప్తంగా 2040 చెరువులకు ప్రభుత్వం రూ.151.14కోట్లు మంజూరు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం ఆయన పట్టణంలోని ఎంజీఎల్‌ఐ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. మొదటి విడత 1073 చెరువుల పనులను మంజూరుచేసినట్లు తెలిపారు. అవి చివరిదశ కు చేరుకున్నాయని, మిగిలిపోయిన పనులను పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో మిషన్ కాకతీయ రెండోవిడత పనుల కింద 181చెరువులను మంజూరు చేసినట్లు వివరించారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తిచేయాలని కోరారు.
ఎల్లూరు డబుల్‌రోడ్డు నిర్మాణానికి రూ.రెండుకోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు. పీజీ కళాశాల భవన నిర్మాణానికి రూ.4.60కోట్లు మంజూరయ్యాయని, త్వరలో ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో 900 గ్రామాల్లో ఓఆర్‌సీసీ ట్యాంకులను, పైపులైన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. ఆగస్టు నాటికి జొన్నలబొగుడ లిఫ్ట్ నుంచి తాగునీటిని అందిస్తామని చెప్పారు. కొల్లాపూర్‌లో రూ.మూడుకోట్లతో ఆడిటోరియం, షాదీఖానా, అధునాతన గ్రంథాలయాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం పట్టణంలో ఇటీవల మరణించిన రామస్వామి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.
ఈనెల 14న కొల్లాపూర్ నియోజకవర్గ యువతీ, యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు పదో తరగతి పాసైన యువతీయువకులు హాజరుకావాలని కోరారు. సమావేశంలో స్పెషల్ అధికారి కృష్ణయ్య, ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, టీఆర్‌ఎస్ నాయకులు నర్సింహారావు, బాలస్వామి, మేకల రాముడు, సుబ్బారావు పాల్గొన్నారు.
రెండో విడతకు రూ.151 కోట్లు
Published Sun, Apr 10 2016 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
Advertisement