ఆన్ లైన్ లో పీజీఈసెట్
విద్యా మండలి చరిత్రలో తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చరిత్రలోనే తొలిసారిగా ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష(పీజీఈసెట్)’ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ‘పేపర్‌లెస్’గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ నేపథ్యంలోనే పలు ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. బుధవారం పీజీఈసెట్‌తో పాటు ఎడ్‌సెట్, పీఈసెట్ కమిటీల సమావేశాలు ఉస్మానియా వర్సిటీలో జరిగాయి. అనంతరం పాపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్ విధానానికి కాస్త ఖర్చు ఎక్కువ అవుతున్నప్పటికీ.. మాస్ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం వంటి వాటిని నియంత్రించేందుకు ఆన్‌లైన్ విధానమే ఉత్తమమని చెప్పారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న పీజీఈసెట్ పరీక్షలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎంసెట్ మెడికల్ విభాగం పరీక్షను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని భావించామని.. కానీ భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో మౌలిక వసతుల సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. అయినా దీనిపై ఈనెల 13న నిపుణుల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం పీజీఈసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ల షెడ్యూల్‌లను విడుదల చేశారు.
14న ఎడ్‌సెట్ నోటిఫికేషన్
బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ నోటిఫికేషన్ ఈ నెల 14న విడుదల కానుంది. అదేరోజు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా మే 7 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు ఫీజు రూ.150, మిగతావారికి రూ.300. మే 21 నుంచి www.tsedcet.org నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 27న పరీక్ష జరుగుతుంది. జూన్ 12న ఫలితాలను వెల్లడిస్తారు.
పీఈసెట్ షెడ్యూల్ ఇదీ
వ్యాయామ విద్యకు సంబంధించి బ్యాచిలర్ (బీపీఈడీ), డిప్లమో(డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీఈసెట్)’ మే 11న జరగనుం ది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 10 లేదా 11న విడుదల చేయనున్నారు. 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 25వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 1 వరకు, రూ.2,000తో మే 5వరకు, రూ.5,000 రుసుముతో మే 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.700. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకున్నవారు మే 2నుంచి, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకున్నవారు మే 10 నుంచి హాల్‌టికెట్లను www.tspecet.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేహదారుఢ్య పరీక్షలు హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.
పీజీఈసెట్ షెడ్యూల్ ఇలా..
ఎంఈ/ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పీజీఈసెట్-16ను సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు. పీజీఈసెట్‌లోని వివిధ విభాగాల పరీక్షలు మే 30 నుంచి జూన్ 3వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరుగుతాయి. ఈ పరీక్షలకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ కేంద్రాల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఈనెల 11న పీజీఈసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. 14వ తేదీ నుంచి www. tspgecet.acorg, www.osmania. ac.in వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.800. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 23 వరకు, రూ.500 ఫైన్‌తో మే 9వరకు, రూ.2,000 తో మే16 వరకు, రూ.5వేలతో మే 23వరకు, రూ.10వేల ఫైన్‌తో మే 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 23 నుంచి 28 వర కు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 24న ఫలితాలను వెల్లడిస్తారు.