
చుక్కలు చూపిన ఫిజిక్స్!
* రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్
* నిమిషం నిబంధనతో ఇబ్బందులు
* పరీక్ష రాయలేకపోయిన పలువురు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఎంసెట్-2015 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలో భౌతికశాస్త్రం (ఫిజిక్స్) ప్రశ్నలు విద్యార్థులను తికమకపెట్టాయి. ప్రశ్నలు కఠినంగా ఉండడంతో చాలా వాటికి సమాధానాలు రాయలేకపోయినట్లు ఎక్కువ మంది విద్యార్థులు పేర్కొన్నారు. గణితం, రసాయనశాస్త్రం ప్రశ్నలు సులభంగానే వచ్చాయన్నారు. మరోవైపు ఇంజనీరింగ్ కోడ్ ‘ఏ’ ఫిజిక్స్‌లో 84వ ప్రశ్నకు 2, 4 ఆప్షన్లు రెండూ సరైనవేనని సబె ్జక్టు నిపుణులు చెబుతున్నారు. అలాగే కోడ్ ‘ఏ’లో 114, 120వ ప్రశ్నలకు సరైన సమాధానాలను ఆప్షన్లలో ఇవ్వలేదని వెల్లడించారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో జంతుశాస్త్రం, రసాయన, భౌతికశాస్త్రాల్లో ప్రశ్నలు బాగానే వచ్చినా.. వృక్షశాస్త్రంలో ఇచ్చిన ప్రశ్నలు చుక్కలు చూపించి నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.
మెడిసిన్ బీకోడ్ ప్రశ్నపత్రంలో జువాలజీ విభాగంలో 54వ ప్రశ్నకు పూర్తి వ్యతిరేకార్థంతో తెలుగు అనువాదం ఇచ్చారని చెప్పారు. మరోవైపు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించని కారణంగా పలు చోట్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మెదక్ వంటి జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల్లో నిర్ణీత సమయాని కంటే ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు ఆవేదనతోనే వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. మొత్తంగా ఇంజనీరింగ్‌లో ఎంసెట్‌కు 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,28,174 మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,365 మంది దరఖాస్తు చేసుకోగా 84,678 మంది రాశారు.
ఎలాంటి ఫిర్యాదులు లేవు..
రాష్ట్రవ్యాప్తంగా 423 కేంద్రాల్లో గురువారం ఎంసెట్ పరీక్ష జరుగగా.. ఇంజనీరింగ్ విభాగంలో 91.76 శాతం మంది రాశారని, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షకు 91.68 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణరావు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు బాగానే ఉన్నాయని, తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన చెప్పారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. ఈ నెల 16న ఎంసెట్ ప్రాథమిక కీలను విడుదల చేసి.. 23వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే అందిన ఇంటర్ మార్కుల వివరాల ఆధారంగా 25 శాతం వెయిటేజీని కలిపి ఈ నెల 28న ఎంసెట్ తుది ర్యాంకులు ప్రకటిస్తామని రమణరావు వెల్లడించారు.
జేఎన్టీయూహెచ్ భేష్: జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఎంసెట్ నిర్వహణ విధానాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డి ప్రశంసించారు. జేఎన్టీయూహెచ్‌లో ఉదయం 6 గంటలకు కడియం శ్రీహరి ఇంజనీరింగ్ ప్రశ్నపత్రాల కోడ్ ‘క్యూ’ను విడుదల చేశారు. ఉదయం 9.30కు మంత్రి లక్ష్మారెడ్డి మెడికల్ ప్రశ్నపత్రాల కోడ్ ‘ఎస్’ను విడుదల చేశారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా చెప్పారు.
నిమిషం ని‘బంధనం’
ఎంసెట్‌లో ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించవద్దనే నిబంధన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొని పరీక్షా కేంద్రానికి వెళ్లేసరికి ఆలస్యం కావడంతో మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్‌కు చెందిన సుధాకర్‌ను పరీక్షకు అనుమతించలేదు. దీంతో కంటతడి పెడుతూ వెనుదిరిగాడు. ఇదే జిల్లా సిద్ధిపేటలో ముగ్గురు పరీక్ష రాయలేకపోయారు. నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న ముగ్గురు విద్యార్థులు రాయకుండానే వెనుదిరిగారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన వికలాంగ విద్యార్థి ప్రదీప్ నిమిషం ఆలస్యంగా రావడంతో అతడిని అధికారులు అనుమతించలేదు. దీంతో ప్రదీప్ ఏడుస్తూ వెళ్లిపోయాడు. ఆలస్యంగా వచ్చిన కారణంగా వికారాబాద్‌లో ఏడుగురు, నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయూరు.
సెంటర్ ఓ చోట.. పరీక్ష మరోచోట
పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి సమయం లేకపోవడంతో పలుచోట్ల అధికారులు ఇతర కేంద్రాల్లో పరీక్ష రాయడానికి అనుమతించారు. హైదరాబాద్‌లోని రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇలా నలుగురు విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ నలుగురిలో ఇద్దరు తార్నాకలోని ఓ కేంద్రంలో, మరొకరు రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ కేంద్రంలో, మరో విద్యార్థి మేడ్చల్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో ఎంసెట్ రాయాల్సి ఉంది. కానీ ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు సమయం లేకపోవడంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారుల అనుమతితో పాలిటెక్నిక్ కాలేజీలో పరీక్ష రాశారు. ఇక వరంగల్ జిల్లాకు చెందిన చిదిరాల భరత్ అనే విద్యార్థి కరీంనగర్ కేంద్రంలో ఎంసెట్ రాయాల్సి ఉంది. కానీ వెళ్లేందుకు సమయం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా.. వారు ఆర్డీవో సహాయంతో వరంగల్ కిట్స్ కళాశాలలో పరీక్ష రాయించారు.