రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడలోని పోచమ్మ ఆలయానికి పోలీసులు మంగళవారం తాళాలు వేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గ్రామ సర్పంచ్ సునీతా రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ కసూర్తి నరేందర్ మధ్య విబేధాలే తాజా పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఇరు వర్గాలూ దసరా ఉత్సవాల నిర్వహణకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ సోమవారం ఇరు వర్గాలతో సమావేశమయ్యారు. సర్పంచ్, మాజీ సర్పంచ్ వర్గాల నుంచి చెరో ఏడుగురు చొప్పున మొత్తం 14 మందితో కమిటీ వేసుకుని దసరా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు.
దీంతో సర్పంచ్ సునీతా రాజ్‌కుమార్ ఏడుగురి పేర్లను ఇచ్చారు. అయితే, కస్తూరి నరేందర్ వర్గం నుంచి పేర్లను ప్రకటించలేదు. దీంతో పోచమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సర్పంచ్ సునీతా రాజ్‌కుమార్ వర్గీయులు సమాయత్తం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని తాళాలు వేశారు. మాజీ సర్పంచ్ వర్గీయులు కూడా వస్తే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే ప్రమాదం ఉందన్న ముందస్తు జాగ్రత్తతో చర్యలు తీసుకున్నారు.