
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ జనసమితితో సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం తెలంగాణ జనసమితి కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో భేటీ అయ్యారు. ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితులు, కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించాలని కోరారు. కార్మికులకు తాము అండగా ఉంటామని, సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కోదండరాం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి ఆర్టీసీ కార్మికులు ఎంతగానో తోడ్పడ్డారని, వారు సమ్మె చేయకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఆర్టీసీని బలహీనపరుస్తోందని ఆరోపించారు. కార్మికులకోసం సంఘీభావ ఉద్యమాన్ని చేపట్టడంలో కీలక పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి మాట్లాడుతూ తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించాలని అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్లు వివరించారు. అనంతరం సీపీఎం, సీపీఐ నేతలతోనూ ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమై మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. కార్మికుల డిమాండ్ల సాధనకు సహకరిస్తామని స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను గౌరవించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని, కార్మికులపై కక్షపూరిత వైఖరిని విడనాడాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment