బల్ల‘కట్టు’తప్పితే.. ఫట్టే ! | Pontoon management rights | Sakshi
Sakshi News home page

బల్ల‘కట్టు’తప్పితే.. ఫట్టే !

Published Mon, Dec 15 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

Pontoon management rights

హుజూర్‌నగర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై నడుపుతున్న బల్లకట్టు ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బల్లకట్టుపై ప్రయాణం సాగిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకపోవడం, నిర్వహణలోపం, డ్రైవర్ల అనుభవరాహిత్యంతో బల్లకట్టు ప్రయాణం ప్రమాదాలకు నెల వైంది. కృష్ణానది ఒడ్డున ఉన్న నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం మట్టపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుం టూరు జిల్లా తంగెడ వరకు, మేళ్లచెరువు మండలం చింతిర్యాల నుంచి మోర్జంపహాడ్, బుగ్గమాదారం మీదుగా గుంటూరు జిల్లా మాదిపహాడ్‌కు రోడ్డు మార్గం లేకపోవడంతో బల్లకట్టు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఆయా జిలా ల జిల్లా పరిషత్‌లు బల్లకట్టులు నడిపేందుకు బహిరంగ వేలం నిర్వహిస్తాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు రేవుల ద్వారా ఏడాదికి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది.
 
 నిబంధనలకు నీళ్లు..
 వేలంలో బల్లకట్టు నిర్వహణ హక్కులు పొం దిన వారు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంప్రతి రేవు నుంచి రెండు బల్లకట్టులు తిప్పాల్సి ఉండగా ఇరు జిల్లాల కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఒకే బల్లకట్టును నడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గం టల వరకు మాత్రమే బల్లకట్టు తిప్పాల్సి ఉంది. సమయ పాలన లేకుండా రాత్రింబవళ్లు బల్లకట్టులు నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నారనిప్రయాణికులుఆరోపిస్తున్నారు.
 
 రేవులకు ఆదాయం ఘనం.. అభివృద్ధి శూన్యం
 జిల్లాలోని మూడు బల్లకట్టు రేవుల ద్వారా నిత్యం సుమారు 3వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరి నుంచి నామమాత్రంగా డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా ఒక్కొక్కరి నుంచి రూ.10 పైనే వసూలు చేస్తున్నారు. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో సిమెంట్ పరిశ్రమలు విస్తరించి ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే సిమెంట్ లారీలు, కార్లు, జీపులు, మోటార్ సైకిళ్లు ఎక్కువ భాగం ఈ బల్లకట్టుల మీదుగానే వెళుతుంటాయి. రోజుకు సుమారు 100 లారీలు వెళ్తుండగా ఒక్కో లారికి రూ.600 చొప్పున, 150 కార్లు, జీపులు వెళ్తుండగా ఒక్కో దానికి రూ.300 చొప్పున, మోటార్ బైక్‌లకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వానికి, అటూ నిర్వాహకులకు లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా ఆయా రేవుల వద్ద ప్రయాణికుల కోసం షెల్టర్‌కానీ, బల్లకట్టు రక్షణ పరికరాలు కానీ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.
 
 తరచు ప్రమాదాలు..
 బల్లకట్టు నిర్వాహకుల బాధ్యతారాహిత్యం, డ్రైవర్ల అనుభవలేమితో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాలం చెల్లిన బల్లకట్టులను నడుపుతుండడంతో అవి ఎప్పుడు మరమ్మతులకు గురవుతాయో తెలియని పరి స్థితి నెలకొంది. ఈ క్రమంలో గత ఏడాది మట్టపల్లి రేవు నుంచి బయలుదేరిన బల్లకట్టు గుంటూరు జిల్లా తంగెడ రేవు వద్ద ప్రమాదానికి గురైంది. దీంతో బల్లకట్టుపై ప్ర యాణిస్తున్న టిప్పర్ నదిలోకి పల్టీ కొట్టడంతో బల్లకట్టుపై పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 12న మధ్యాహ్న సమయంలో పెళ్లిబృందంతో పాటు సుమారు 100 మంది ప్రయాణికులతో మట్టపల్లి రేవు నుంచి తంగెడ రేవుకు బయలు దేరిన బల్లకట్టు మధ్యలో ఇం జిన్ ఆగిపోయింది. అదృష్టవశాత్తు నదిలో నీటి ప్రవాహం పెద్దగా లేకపోవడంతో ఈదురు గాలులకు బల్లకట్టు ఆవలి ఒడ్డుకు కొట్టుకొచ్చి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే విధంగా గడిచిన ఏడాది బుగ్గమాదారం వద్ద కృష్ణానదిలో ఆవలి ఒడ్డువైపు సిమెంట్ లారీ బల్లకట్టు మీద నుంచి నదిలో పడిన సంఘటన చోటుచేసుకుంది.
 
 కొరవడిన పర్యవేక్షణ..
 ప్రతి రోజు నల్లగొండ, గుంటూరు జిల్లాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు, వాహనాలు ఈ బల్లకట్టులపై ప్రయాణం సాగిస్తున్నాయి. బల్లకట్టు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా సంబంధిత జిల్లా పరిషత్ అధికారులు ఏనాడూ పట్టించుకోలేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా నిబంధనల ప్రకారం బల్లకట్టులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement