ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆస్పత్రి భవనం
సాక్షి, ఖమ్మం: ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించక మూడేళ్లు కావొస్తోంది. దీంతో కోట్లాది రూపాయల నిధులున్నా వినియోగించుకోలేక.. అధికారులు సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టక.. పరిస్థితి అధ్వానంగా తయారైంది. గతంలో ఆమోదించిన ప్రతిపాదనలను కూడా పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వాస్తవానికి ఆస్పత్రి పనితీరు, సౌకర్యాల కల్పనకు విధిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి, అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు సమావేశం నిర్వహిస్తున్నారు.
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీఎస్) సమావేశం గురువారం నిర్వ హించనున్నారు. హెచ్‌డీఎస్ చైర్మన్‌గా జెడ్పీ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆస్పత్రిలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశానికి చైర్మన్ లింగాల కమల్‌రాజ్ హాజరుకానున్నారు. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు పెద్దాస్పత్రి అభివృద్ధి కొరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ఆస్పత్రి అభివృద్ధి కోసం చేపట్టే అడ్వైజరీ కమిటీ సమావేశం సుమారు మూడేళ్లుగా నిర్వహించకపోవడంతో ప్రధాన ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. 2016, అక్టోబర్ 28న అప్పటి జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఆ తర్వాత దాని ఊసెత్తలేదు. దీంతో ఇక్కడ సౌకర్యాల కల్పన, మెరుగైన వైద్య సేవలు కరువయ్యాయి. ఆస్పత్రి పనితీరు, సౌకర్యాల కల్పనకు విధిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి, అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆస్పత్రిలో అవసరమైన చర్యలు తీసుకోవడం, నిధుల సమీకరణ, వ్యయం, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది పనితీరు, కొరత, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలి. అలాగే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎజెండాను రూపొందించి.. అందులో ప్రతిపాదించిన అంశాలకు సంబంధించి సభ్యుల నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంది. కానీ.. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అడ్వైజరీ సమావేశం ఊసే లేకపోవడంతో రోగులకు అందాల్సిన వైద్య సేవలు, సౌకర్యాలు అందకుండా పోతున్నాయి. దీంతో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు.
గట్టెక్కని తీర్మానాలు..
గత అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానించిన పనులు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అప్పడు 38 తీర్మానాలను ప్రవేశపెట్టి.. వెంటనే అమలు చేయాలని తీర్మానించారు. అయితే మూడేళ్లు పూర్తవుతున్నా ఏ ఒక్క తీర్మానం పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి కుంటుపడింది. ఆస్పత్రిలోని బెడ్లు వచ్చే రోగులకు ఏమాత్రం సరిపోవట్లేదని, ఆస్పత్రి స్థాయిని 500 బెడ్లకు పెంచాలని తీర్మానంలో కోరారు. అయితే 150 పడకలతో మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఆ తర్వాత అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆస్పత్రి స్థాయి 400 పడకలకు చేరింది. అయితే 500 పడకల స్థాయి మాత్రం మూడేళ్లు గడిచినా తీరలేదు. రూ.కోట్ల వ్యయంతో 100 పడకల ట్రామా కేర్ భవనాన్ని నిర్మించినా.. అందుబాటులోకి మాత్రం తీసుకురావట్లేదు. అది ప్రారంభిస్తే ఆస్పత్రి స్థాయి 500 పడకలకు చేరుకుంటుంది. కానీ.. భవనం పూర్తయి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రారంభించేందుకు మాత్రం ఎవరూ చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అలాగే స్పెషలిస్ట్ డాక్టర్లను భర్తీ చేయాలని, ఎండోస్కోపీ, లాప్రోస్కోప్, ఈఎన్‌టీ మైక్రోస్కోప్ తదితర పరికరాలు కొనుగోలు చేయాలని, రెండు అంబులెన్స్‌లు కావాలని, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించాలని, అంతర్గత రోడ్ల నిర్మాణం, విద్యుత్ కేవీ సామర్థ్యాన్ని పెంచాలనే తదితర తీర్మానాలు అమోదించారు. కానీ.. వాటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు పూర్తి చేయలేదు. పెద్దాస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జనరల్ ఫిజీషియన్, రేడియాలజిస్టు, డెంటల్, మత్తు డాక్టర్ల కొరత ఉంది. అలాగే ఏఎన్‌ఎం, నర్సుల కొరత కూడా ఉంది. అంతేకాక ధర్నాచౌక్ వల్ల ఆస్పత్రికి వచ్చే రోగులతోపాటు సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిటీ స్కాన్ లేక ఇబ్బంది..
పెద్దాస్పత్రిలో గతంలో రూ.కోటి వ్యయంతో సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు. అయితే గత ఏడాది అది పాడైపోయి అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల్లో సిటీ స్కానింగ్ అవసరమున్న వారు బయటకు వెళ్లి డయాగ్నస్టిక్ సెంటర్లలో స్కానింగ్ తీయించుకోవాల్సి వస్తోంది. ఉచితంగా అందాల్సిన స్కానింగ్ సేవలను బయట వేలకు వేలు వెచ్చించి పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీ స్కాన్ పాడైపోయి సంవత్సరం దాటినా దానిని అందుబాటులోకి తేవాలని ఎవరూ ప్రయత్నించకపోవడం శోచనీయం. హెచ్‌డీఎస్ సమావేశంలోనైనా నిర్ణయం తీసుకొని అందుబాటులోకి తేవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.
నిధులున్నా..
పెద్దాస్పత్రికి సంబంధించి హెచ్‌డీఎస్ నిధులు రూ.కోట్లలో మూలుగుతున్నా వాటిని వెచ్చించలేకపోతున్నారు. మూడు నెలలకు ఒకసారి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి.. ఆస్పత్రికి అవసరమైన సౌకర్యాలను కల్పించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి కుంటుపడుతోంది. ఇప్పటికైనా అభివృద్ధి కమిటీలో పలు సమస్యలపై తీర్మానాలు ఆమోదించి.. వెంటనే పనులు ప్రారంభించాలని పలువురు రోగులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment