
వచ్చే ఏడాదీ ప్రస్తుత విద్యుత్ చార్జీలే...
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలు పెంచుతూ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు రాష్ట్రంలో ప్రస్తుత చార్జీలే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18)లో కూడా అమలు కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇంకా సమర్పించకపోవడంతో వచ్చే ఏడాదికి సంబంధించి చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోలేకపోయామని తెలిపింది.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో తదుపరి నిర్ణయం వరకు ప్రస్తుత చార్జీలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనల సమర్పణకు డిస్కంలు ఏప్రిల్ 15 వరకు గడువు కోరాయి. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి కొత్త టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసేందుకు కనీసం 45 రోజుల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశముందని ఈఆర్సీ వర్గాలు తెలిపాయి.