
మరణ మృదంగం
- సుల్తాన్‌బజార్‌లో ఒకరు.. పేట్లబురుజులో మరొకరు
- మరో ఏడుగురికి ఇన్‌ఫెక్షన్.. ఉస్మానియాకు తరలింపు
- మృతుల బంధువుల ఆందోళన..
- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో మరణ మృదంగం మోగుతోంది. సుఖ ప్రసవం కోసం ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో శుక్రవారం ఇద్దరు మహిళలు మృతి చెందగా... శనివారం అదే ఆస్పత్రిలో ఒకరు, పేట్లబరుజులో మరొక మహిళ మరణించారు. ఇన్‌ఫెక్షన్‌కు గురైన మరో ఏడుగురు బాలింతలను ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లను మూసివేసి తాత్కాలికంగా సిజేరియన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన గర్భిణులను నిలోఫర్, గాంధీ ఆస్పత్రులకు తరలిస్తోంది. బాలింతల మృతిపై విచారణకు ఆదేశించింది.
హఠాత్తుగా పడిపోయిన బీపీ...
సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈ నెల 20న 19 సిజేరియన్లు జరిగాయి. వీరిలో పది మందికి ఇన్‌ఫెక్షన్ సోకింది. అరుణానగర్‌కు చెందిన శారద(22) మొదటి కాన్పుకోసం ఈ నెల 18న, మహబూబ్‌నగర్‌కు చెందిన జయమ్మ మూడో కాన్పు కోసం 19న ఆస్పత్రిలో చేరారు. వీరికి 20న డెలివరీ చేశారు. వీరికి హఠాత్తుగా బీపీ పడిపోయి శుక్రవారం మృతి చెందారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలానికి చెందిన అర్చన(28) కాన్పుకోసం ఈ నెల 17న ఆస్పత్రిలో చేరింది. 20న ఆమెకు వైద్యులు సిజేరియన్ చేశారు. అకస్మాత్తుగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించగా... శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆమె కూడా తుదిశ్వాస విడిచింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే...
నాగర్‌కర్నూలుకు చెందిన రత్నమాల సుఖ ప్రసవం కోసం గురువారం పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు శనివారం ఉదయం 11 గంటలకు డెలివరీ చేశారు. ప్రసవించిన గంటన్నరకే ఆమె మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని ఆమె భర్త ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నలుగురి పరిస్థితి విషమం..!
ప్రస్తుతం ఉస్మానియాలో రజిత, సుజాత, నాగేశ్వరి, భాగ్యలక్ష్మి, అనసూయ, షహానా బేగం చికిత్స పొందుతుండగా... మరో మహిళ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిపోయారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సుల్తాన్‌బజార్ ఆస్పత్రి నాలుగో అంతస్తులో ఇటీవల మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించిన ఆపరేషన్ థియేటర్‌లో కనీస సౌకర్యాలు లేక మూసివేసి ఉంచడం కొసమెరుపు.