ఆరె కటికలను ఎస్సీ జాబితాలో చేర్చాలి
సంఘం తెలంగాణ అధ్యక్షుడు నర్సింగ్‌రావు డిమాండ్
వికారాబాద్: ఆరె కటికలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్ తార్నాకలో అఖిలభారత ఆరె కటిక సమాజం ఆధ్వర్యంలో నర్సింగ్‌రావును రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తర భారతదేశంలోని 13 రాష్ట్రాలు ఆరె కటికలను ఎస్సీలుగా గుర్తించి సముచిత స్థానం కల్పిస్తున్నాయని తెలిపారు. ఎస్సీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తే వారి పిల్లలకు కూడా ఉన్నత అవకాశాలు దక్కుతాయన్నారు.
గతంలో పలు ప్రతిపాదనలతో కేంద్రాన్ని కలిశామని, వాటిని పరిశీలించి మరింత సమాచారం కోరిందని చెప్పారు. ఆరె కటిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వికారాబాద్‌కు చెందిన తనను ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. అఖిల భారత ఆరెకటిక సమాజం చీఫ్ ప్యాట్రన్ నేతికార్ ప్రేమ్‌లాల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నేతికార్ రమేష్ కటిక, కోశాధికారిగా కరణ్‌కోట్ అశోక్‌జీ కటిక ఎన్నికైనట్టు చెప్పారు. సంఘం మహిళావిభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా గౌలికార్ జయనర్సింగ్‌రావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. రాధాభాయ్, ప్రమీల, లక్ష్మీభాయ్‌లకు రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.