సాక్షి, సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో పిల్లలు ఆడుకునేందుకు తగినన్ని ఆటస్థలాలు లేవు. బస్తీల్లోని పేదలు చిన్నపాటి వేడుకలు చేసుకునేందుకు వారు భరించగలిగే స్థితిలో ఫంక్షన్ హాళ్ల అద్దె ధరలు లేవు. అలాంటి వారికి ఉపశమనం కలిగించేవి జీహెచ్‌ఎంసీకి చెందిన కమ్యూనిటీ హాళ్లు, ఆటస్థలాలు మాత్రమే. ఇప్పుడు అవి కూడా పరాయి చేతుల్లోకి పోయాయి. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఫంక్షన్‌హాళ్లు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన కమ్యూనిటీ హాళ్లు, ఆటస్థలాలను పేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, మహిళలకు స్వీయ రక్షణ, ఆర్థిక అవకాశాలు, తదితర పేర్లతో స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నారు. ఇలా శేరిలింగంపల్లి జోన్‌లో ఒక కమ్యూనిటీ హాల్‌ను, ఒక ప్లేగ్రౌండ్‌ను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేందుకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది. జోన్‌లోని ఓల్డ్ ఎంఐజీ వివేకానంద ప్లేగ్రౌండ్‌లోని కమ్యూనిటీ హాల్‌ను బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ హెడ్ హెల్డ్ హైఫౌండేషన్(హెచ్‌హెచ్‌హెచ్‌ఎఫ్)కుఅప్పగించాలని నిర్ణయించారు. నిరక్షరాస్యులు, తక్కువ విద్యార్హతలున్న యువతకు తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు, వారి కాళ్లపై వారు నిలబడేలా చేసేందుకు ఏడాదిపాటు ఈ కమ్యూనిటీ హాల్‌ను తమకు ఇవ్వాల్సిందిగా సదరు సంస్థ కోరింది. ఆర్నెళ్లకు ఒక బ్యాచ్ వంతున రెండు బ్యాచ్‌లకు ఏడాది పాటు శిక్షణ కోర్సులు నిర్వహించడమే కాక, వారికి ఉద్యోగాలొచ్చేందుకు కూడా సహకరిస్తామని, ఇప్పటికే తమకు ఎన్నో సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నాయని పేర్కొనడంతో దానికి కమ్యూనిటీ హాల్‌ను ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
యువత, మహిళలకు ఉపాధి పేరుతో..
మరో సంస్థ.. ఇంకా పేరు ఆమోదం పొందకుండానే గోపన్‌పల్లి ప్లేగ్రౌండ్‌ను, మహిళా భవన్‌ను వినియోగించుకోవడానికి జీహెచ్‌ఎంసీని కోరింది. జైభారతి(ఉమెన్ బైక్స్) అనే సంస్థ వాహిని అసోసియేట్స్ పేరిట దీన్ని ఇవ్వాలని కోరింది. వాహిని అసోసియేట్ అనే ఈ పేరు ఇంకా ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంటూనే ప్లేగ్రౌండ్‌లో మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ, స్పోర్ట్స్ శిక్షణ ఇస్తామని పేర్కొంది. తద్వారా మహిళలు ఆర్థిక స్వతంత్రాన్ని పొందడమేకాక ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని విజ్ఞప్తి చేయడంతో దానికి ఇచ్చేందుకు ఓకే చేశారు. శిక్షణ అనంతరం ఆయా సంస్థల్లో నియామకాలకు కూడా కృషి చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా మహిళలకు కెరీర్ గైడెన్స్, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తో పాటు ఆయా అంశాల్లో అవగాహన.. ప్రభుత్వపరంగా అందే స్కీమ్‌లు వంటివాటి గురించి వివరించి వారికి తగిన తోడ్పాటునిస్తామనడంతో నాయకులు ఇచ్చేందుకు అంగీకరించారు.
అమలుపై అనుమానాలు
నిరుపేద యువతకు, మహిళలకు తగిన ఉపాధి కల్పించేందుకు ముందుకొస్తే ఎవరూ కాదనరు. బహుశా జీహెచ్‌ఎంసీ కూడా అలాగే భావించి ఉండవచ్చు. కానీ.. ఒక కార్యక్రమం కోసం ఆయా స్థలాలు, కమ్యూనిటీ హాళ్లు పొందిన సంస్థలు మొదట్లో కొంతకాలం బాగానే పనిచేసినప్పటికీ, తర్వాత తమ వ్యాపారం, లాభాలు చూసుకోవడంపైనే దృష్టి సారిస్తున్నాయి. ఉచితంగా ప్రభుత్వ/జీహెచ్‌ఎంసీ స్థలాలను పొందేందుకే ఎత్తుగడనే అభిప్రాయముంది. అందుకు ‘లూకేఫ్’(లగ్జరీ టాయిలెట్)లను ప్రజలు ఉదాహరణగా చూపుతున్నారు. నగరంలో తగినన్ని పబ్లిక్ టాయిలెట్లు లేనందున ఓ ప్రైవేట్ సంస్థకు లూకేఫ్‌ల ఏర్పాటుకు నామమాత్రపు ధరకు పదేళ్లపాటు లీజుకిచ్చారు. అది ఉచితంగా పబ్లిక్ టాయిలెట్లను నిర్వహించడంతో పాటు కియోస్క్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో టీ, కాఫీల నుంచి స్నాక్స్, టిఫిన్లు, కూల్‌డ్రింక్స్ వంటివి విక్రయిస్తున్నారు. అంతే విస్తీర్ణంలో, అదేరకమైన దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటే నగర ప్రధాన రహదారుల్లో నెలకు రూ. 20 వేల వరకు అద్దె చెల్లించాలి. అద్దె లేకుండా కేవలం లగ్జరీ టాయిలెట్ల ఏర్పాటు, నిర్వహణ పేరిట బాగా వ్యాపారం జరిగే ఎన్టీఆర్ గార్డెన్ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఒప్పందం ప్రకారం మొత్తం 66కు గాను 22 లూకేఫ్‌లు మూణ్నెళ్లలోగా ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ దాదాపు ఏడాదైనా పది కూడా ఏర్పాటు చేయలేదు. అయినా సరే జీహెచ్‌ఎంసీలో పట్టించుకున్న వారు లేరు. ఎక్కడ వ్యాపారావకాశం ఉంటుందో అలాంటి కొన్నిచోట్ల మాత్రమే ఆ పదీ చేశారు. ఎక్కడ ఎన్ని ఏర్పాటయ్యాయో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి కనీస సమాచారం లేదు. అంతా జోన్లకు అప్పగించామని చెబుతూ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. జోన్లు, సర్కిళ్లలో జరిగే పనులపై తనిఖీలుండవు. దాంతో అక్కడ ఇష్టారాజ్యంగా మారింది. వీటిని ఏర్పాటు చేసిన చోట కూడా టాయిలెట్ల నిర్వహణను పట్టించుకున్నది లేదు. వాస్తవానికి అవి పబ్లిక్ టాయిలెట్లని ప్రజలకు తెలియడమే కష్టంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment