వేసవి సీజన్‌.. భద్రత మరిచెన్‌! | Private Travel Bus Service Without Safety in Hyderabad | Sakshi
Sakshi News home page

వేసవి సీజన్‌.. భద్రత మరిచెన్‌!

Published Mon, Apr 22 2019 8:18 AM | Last Updated on Mon, Apr 22 2019 8:18 AM

Private Travel Bus Service Without Safety in Hyderabad - Sakshi

బస్సులను తనిఖీ చేస్తున్న ఆర్టీఏ అధికారులు (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: వేసవి రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్‌ బస్సులు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. రహదారి భద్రతకు విరుద్ధంగా పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి. తరచూ ఎక్కడో ఒకచోట  ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కేవలం అధిక ఆదాయమే లక్ష్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌తో పాటు బెంగళూర్, మైసూర్, చెన్నై, ముంబై, షిర్డీ, నాగపూర్‌ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న వందలాది బస్సులు రోడ్డు భద్రతా నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ బస్సుల అక్రమ రవాణాపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గత నెల రోజులుగా దాదాపు 300 బస్సులను తనిఖీ చేశారు.  హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు  నియమించారు. ఈ తనిఖీల్లో 100 బస్సులపై కేసులు నమోదు చేసిన అధికారులు... మరో 30 బస్సులను జప్తు చేశారు. ఈ బస్సుల్లో కొన్ని పర్మిట్‌ ఫీజు చెల్లించకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు. 

రెండో డ్రైవర్‌ ఎక్కడ?  
నగరంలోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, లక్డీకాపూల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, చిత్తూరు, తిరుపతి, అమలాపురం, రాజమండ్రి, బెంగళూర్‌ తదితర నగరాలకు ప్రతిరోజు సుమారు 950 బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో రెండు రాష్ట్రాల పర్మిట్లపై తిరిగేవి కొన్నయితే, జాతీయ పర్మిట్లపై తిరిగే బస్సులు మరికొన్ని ఉన్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే ప్రతి బస్సులో కచ్చితంగా రెండో డ్రైవర్‌ ఉండాలి. ప్రతి 8గంటలకు ఒకసారి డ్రైవర్లు మారాలి. కానీ ప్రైవేట్‌ బస్సుల్లో ఒక్క డ్రైవరే రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వేసవి కావడంతో పగటి పూట త్వరగా అలసిపోవడం సాధారణమే. ఆ అలసటతోనే తిరిగి బస్సులు నడపడం వల్ల రాత్రి వేళల్లో, తెల్లవారుజామున నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇద్దరు డ్రైవర్లు పరస్పరం విధులు మార్చుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. గతంలో జరిగిన అనేక ప్రమాదాల్లో రెండో డ్రైవర్‌ లేకపోవడాన్ని రవాణాశాఖ ప్రధాన తప్పిదంగా  పరిగణించింది. తరచూ ప్రమాదాలు జరిగిన సమయంలో ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్‌ ఆపరేటర్లు... ఆ తర్వాత  ఉపసంహరించుకుంటున్నారని, ప్రయాణికుల రద్దీ కారణంగా ఎక్కువ ట్రిప్పులు నడిపేందుకు డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతున్నారని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల తాము నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఎక్కు వ శాతం ఇలాంటి బస్సులే ఉన్నట్లు పేర్కొన్నారు.

అదనపు సీట్లు.. సరకు రవాణా  
మరోవైపు అక్రమార్జన కోసం కొందరు ఆపరేటర్లు సీట్ల మధ్య అదనంగా మరిన్ని ఏర్పాటు చేసి భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. బస్సు సామర్థ్యానికి అనుగుణంగా 38–45 సీట్ల వరకు ఉంటాయి. కానీ సీట్ల మధ్యలో మరిన్ని అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు కొన్ని బస్సులు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బట్టలు, ఐరన్‌ తదితర వస్తువులను రవాణా చేయడమే లక్ష్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున సరకు రవాణాకు చేస్తున్నాయి. ఇలాంటి బస్సుల్లో ఓవర్‌లోడ్‌ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని బస్సుల్లో టన్నుల కొద్దీ సరకు రవాణా చేస్తున్న ఉదంతాలు తరచూ అధికారుల తనిఖీల్లో బయటపడడం గమనార్హం. 

అగ్నిమాపక యంత్రాల్లేవ్‌..  
అనూహ్యమైన పరిస్థితుల్లో బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నియంత్రించేందుకు అవసరమైన అగ్నిమాపక పరికరాలను కూడా అమర్చడం లేదు. ఓవైపు ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అగ్నిప్రమాదాలకు అవకాశం ఉంటుంది. మరోవైపు విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో కూడా ప్రమాదాలు జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రాణనష్టం చోటుచేసుకోకుండా డ్రైవర్లు, బస్సు సిబ్బంది అప్పటికప్పుడు అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ఈ యంత్రాలను వినియోగించాలి. కానీ కొన్ని బస్సులు అగ్నిమాపక యంత్రాలను వినియోగించడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ పరికరాలను ఎలా వినియోగించాలనే విషయంలోనూ డ్రైవర్లకు ఎలాంటి శిక్షణను ఇవ్వడం లేదు. మంటలు ఎక్కడి నుంచి  వస్తున్నాయో గుర్తించి అగ్నిమాపక యంత్రాల ద్వారా వాటిని ఆర్పేందుకు చర్యలు తీసుకోవాలి. విదేశాల్లో ఇందుకోసం  డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. కానీ మన దగ్గర ప్రైవేట్‌ బస్సులే కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనూ ఇలాంటి శిక్షణను ఇవ్వడం లేదని రహదారి భద్రతా నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement