
మల్దకల్ మండల రైతు సమన్వయ సమితి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న వ్యవసాయశాఖ పర్యవేక్షకుడు హోక్యానాయక్ (ఫైల్)
సాక్షి, గద్వాల : జిల్లాలో రైతు సమన్వయ సమితుల ప్రక్రియ ఓ కొలిక్కి రావడం లేదు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతోపాటు ఇతర వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.నాలుగు వేల చొప్పున ఏటా రెండుసార్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇందులో గ్రామం మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు నాలుగు అంచెల్లో ఉండే రైతు సమన్వయ సమితులు కీలకపాత్ర పోషించనున్నాయి. సభ్యులను నామినేట్ చేసే బాధ్యతను జిల్లా ఇన్‌చార్జి మంత్రికి అప్పగించింది. గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీలోగా కమిటీల ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ గడువు ముగిసి ఐదు నెలలు కావస్తున్నా అలంపూర్ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి సమితులపై ఎవరూ పట్టించుకోవడం లేదు. అలంపూర్ నియోజకవర్గంలో ఒక్క కమిటీ కూడా వేయని పరిస్థితి నెలకొనగా, గద్వాల నియోజకవర్గంలో 86కమిటీలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. గ్రామ, మండల సమితులతోపాటు జిల్లా సమన్వయ సమితులు వెంటనే వేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఇది కార్పొరేషన్ తరహాలో పనిచేస్తుందని ఆయన ప్రకటించడం గమనార్హం.
ఆచరణకు నోచుకోని కమిటీలు
కలెక్టర్ నేతృత్వంలో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ప్రోత్సాహక పెట్టుబడి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసే రైతు సమన్వయ సమితులకు సంబ ంధించి విధి విధానాలను వ్యవసాయశాఖ రూపొం దించింది. ఈ మేరకు గత ఏడాది ఆగస్టులోనే జీఓ ఎంఎస్ నం.39 జారీ అయింది. దీనికి అనుగుణంగానే జిల్లాలో ఈ కమిటీల ప్రక్రియ చేపట్టగా గద్వాల నియోజకవర్గంలో మాత్రమే పూర్తయింది. 86రెవెన్యూ గ్రామాల్లో, ఐదు మండలాలకు రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేశారు. గత అక్టోబర్ 15న గద్వాలలో బాధ్యులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. అలంపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ప్రతిష్టంభన నెలకొంది. 121రెవెన్యూ గ్రామాల్లో ఒక్కచోటైనా సమితి ఏర్పాటు కాలేదు. దీంతో జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే వ్యవసాయ శాఖ క్లస్టర్లలో రైతు సమావేశ మందిరాలు నిర్మిస్తామని ప్రకటించినా ఇంతవరకు ఏ గ్రామం లోనూ స్థలాలు ఎంపిక చేయలేదు.
మంత్రి దృష్టికి తీసుకె Ðð ళ్తాం
రైతు సమన్వయ సమితులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశించింది వాస్తవమే. దీనిపై త్వరలోనే జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి తగు కార్యాచరణ చేపడతాం. అలంపూర్ నియోజకవర్గంలో రైతు సమన్వయ సమితులు ఏర్పాటైతేనే జిల్లా కమిటీకి అవకాశం ఉంటుంది. – గోవింద్‌నాయక్, డీఏఓ, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment