పుష్కర పయనం... | Pushkarni people government facilitate special trains,buses | Sakshi
Sakshi News home page

పుష్కర పయనం...

Jul 15 2015 1:23 AM | Updated on Sep 3 2017 5:29 AM

పుష్కర పయనం...

పుష్కర పయనం...

పుష్కర జనం రద్దీ కొనసాగుతోంది...

- ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో తరలిన జనం
- బాసర,భద్రాచలం,రాజమండ్రికి ఎక్కువ రద్దీ
- 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ
- ప్రయాణికుల భద్రత కోసం మోహరించిన ఆర్‌పీఎఫ్    
సాక్షి, సిటీబ్యూరో :
పుష్కర జనం రద్దీ కొనసాగుతోంది. నగరం నుంచి  రాజమండ్రి, బాసర, భద్రాచలం, కాళేశ్వరం తదితర ప్రాంతాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో బయలుదేరి వెళ్తున్నారు. మంగళవారం  భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని  జూబ్లీబస్‌స్టేషన్ నుంచి బాసర, పోచంపాడు పుష్కరఘాట్‌లకు 25 ప్రత్యేక బస్సులను, భద్రాచలం, కాళేశ్వరం ప్రాంతాలకు మరో 25 అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. రాజమండ్రి వైపు వెళ్లే  92 రెగ్యులర్ బస్సులతో పాటు మరో 11 బస్సుల్లో  ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. రాజమండ్రి వైపువెళ్లే  రైళ్లు సైతం కిక్కిరిసాయి. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. కాగా తొలిరోజు రద్దీ ఓమోస్తరుగా ఉందని, ఈ నెల 17,18,19 తేదీల్లో రద్దీ పెరిగే  అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
రైళ్లలో భారీ రద్దీ...
బస్సుల కంటే  రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంది. రాజమండ్రి వైపు మంగళవారం బయలుదేరిన రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు  కోణార్క్, ఈస్ట్‌కోస్ట్, ఫలక్‌నుమా, విశాఖ, గోదావరి, లోకమాన్యతిలక్-విశాఖ, గౌతమి, నాగావళి ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరో స్పెషల్ ట్రైన్ బయలుదేరింది. రిజర్వేషన్ బోగీలతో పాటు, జనరల్ బోగీలు సైతం కిక్కిరిసాయి. రాజమండ్రి వైపు వెళ్లే బస్సుల్లోను భారీ రద్దీ కనిపించింది. సాధారణంగా నడిచే 92 సర్వీసులతో పాటు, 11 సర్వీసులు  అదనంగా బయలుదేరి వెళ్లాయి. బాసర, భద్రాచలంల వైపు వెళ్లే రైళ్లలోనూ  భారీ రద్దీ నెలకొంది. రెగ్యులర్‌గా నడిచే 10 రైళ్లతో పాటు, మరో ప్యాసింజర్ రైలును భద్రాచలం వరకు నడిపారు. అలాగే బాసర వైపు వెళ్లే  9 రైళ్లతో పాటు, మరో స్పెషల్ ట్రైన్ కాచిగూడ నుంచి బయలుదేరింది. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని  విజయవాడ-భద్రాచలం, భద్రాచలం-వరంగల్ మధ్య అదనపు రైళ్లను  ఏర్పాటు చేశారు.

విజయవాడ-భద్రాచలం మధ్య ఈ రైళ్లు ఈ నెల 15,16,17,19,20,21,22,24 తేదీలలో ఉదయం 5.40 కి విజయవాడ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10.20 కి భద్రాచలం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో అదేరోజు  సాయంత్రం 6.30 కు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 11.50 కి విజయవాడ చేరుకుంటాయి. భద్రాచలం-వరంగల్ ప్రత్యేక రైలు కూడా పై  తేదీల్లో ఉదయం 11 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.10 కి వరంగల్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.40 కి వరంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం 5.50 కి భద్రాచలం చేరుకుంటుంది. మరోవైపు కాచిగూడ-విజయవాడ మధ్య నడిచే డబుల్‌డెక్కర్ రైళ్లను ఈ నెల 15,18 తేదీల్లో అదనంగా నడుపనున్నట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు.
 
భద్రత కట్టుదిట్టం...
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్‌లతో పాటు అన్ని ప్రధాన స్టేషన్‌లలో రైల్వే భద్రతా బలగాలను మోహరించినట్లు ఆర్‌పీఎఫ్ ఎస్పీ జనార్ధన్ తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌లపైన కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలతో నిఘా  ఏర్పాటు చేశారు.
 
అదనపు సదుపాయాలు: సీపీఆర్వో
పుష్కరాలు జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లోని  బాసర, భద్రాచలం, మంచిర్యాల, రామగుండం, రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు స్టేషన్‌లలో స్వచ్ఛమైన మంచినీరు. అదనపు బుకింగ్ కౌంటర్లు, విచారణ కేంద్రాలు, పారిశుధ్య సదుపాయం, ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ యంత్రాలు ఏర్పాటు చేసినట్లు సీపీఆర్వో ఉమేష్ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో  తెలిపారు. పుష్కరాల కోసం 825 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement