రాచకొండలో భూముల లీజు రద్దు! | Racakonda to cancel the lease of land! | Sakshi
Sakshi News home page

రాచకొండలో భూముల లీజు రద్దు!

Published Fri, Dec 19 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

రాచకొండలో భూముల లీజు రద్దు!

రాచకొండలో భూముల లీజు రద్దు!

  • బీడీఎల్ అధికారులతోసీఎస్ సమీక్ష
  •  13 వే ల ఎకరాలు ఫైర్ టెస్టింగ్ కోసం కేటాయింపు
  •  ఆందోళన నేపథ్యంలో.. ఎలాంటి కార్యకలాపాలు
  •  నిర్వహించని బీడీఎల్
  • సాక్షి, హైదరాబాద్: రాచకొండ గుట్టల్లో గత ప్రభుత్వం భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)కు కేటాయించిన 13 వేల ఎకరాల భూమి లీజును  రద్దు చేసే దిశగా తెలంగాణా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బీడీఎల్‌లో ఉత్పత్తయ్యే పలు రకాల పేలుడు పరికరాలను ఈ గుట్టల్లో పరీక్షించేందుకు  ఆ సంస్థకు దాదాపు మూడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం 13 వేల ఎకరాలను 30 ఏళ్ల లీజుపై కేటాయించిన సంగతి విదితమే.

    తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాచకొండ గుట్టలను ఏదో విధంగా వినియోగంలోకి తెచ్చుకునే యత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే అక్కడ చిత్రనగిరి నిర్మించాలని నిర్ణయించారు. ఇటీవల సీఎం ఏరియల్ సర్వే చేయడంతోపాటు, ఆ ప్రాం తంలో పర్యటించిన సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలోనే గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గురుదత్త ప్రసాద్ తోపాటు ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. రాచకొండ గుట్టలో కొంత భాగాన్ని బీడీఎల్‌కు కేటాయించిన నేపథ్యంలో అక్కడి ప్రజలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేశారు. దీనితో బీడీఎల్ కూడా అక్కడ పెద్దగా పరీక్షలేవీ జరుపలేదని సమాచారం, ఆ క్రమంలోనే అప్పట్లోనే లీజు ఒప్పం దాన్ని రద్దుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

    వాటి ఆధారంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసి లీజు రద్దు యోచనలో  ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే సీఎస్ రాజీవ్‌శర్మ ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. బీడీఎల్‌కు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోకుండా.. అక్కడ చిత్రనగిరి లేదా క్రీడానగరి నిర్మించడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ లీజును రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో లీజు కోసం చెల్లించిన మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.   
     
    నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం..

    భూముల క్రమబద్ధీకరణ, పార్లమెంటరీ కార్యదర్శుల నియామక అంశాలపై చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి శుక్రవారం సమావేశం అవుతోంది. సచివాలయంలో ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వం చేపట్టాల్సిన పలు కార్యక్రమాల గురించి కూడా చ ర్చించనున్నారు. ఈనెల 16వ తేదీన జరిగిన మంత్రి మండలి విస్తరణ తరువాత నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కొత్త మంత్రులను పరిచయం చేయడంతోపాటు, గతంలో తీసుకున్న నిర్ణయాలకు  ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

    మంత్రిమండలి పరిమాణం శాసనసభ్యుల సంఖ్య ఆధారంగా 18 మందికి మించి ఉండడానికి వీల్లేని తరుణంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటరీ కార్యదర్శులుగా మరికొందరిని నియమించుకుని వారికి సహాయ మంత్రుల హోదా కల్పించాలని సీఎం నిర్ణయించిన సంగతి విదితమే. నలుగురు ఎమ్మెల్యేల పేర్లను కూడా ప్రకటించడమూ  తెలిసిందే. దీనిపై శుక్రవారం కేబినెట్ భేటీలో విపులంగా చర్చించనున్నారు.

    ఇది కాకుండా ప్రభుత్వ స్థలాల ఆక్రమణల క్రమబద్ధీకరణకు గతంలో జారీ చేసిన జీవో 166పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. ఆ జీవో కింద వచ్చిన దరఖాస్తులను ఏమి చేయాలన్న అంశంపై కోర్టుకు వివరణ ఇవ్వడంతోపాటు, కొత్తగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన తరుణంలో కొత్తగా చట్టం తేవడమా.? లేక వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలా..? అన్న విషయంపై ప్రభుత్వం ఈ మంత్రివర్గ సమావేశంలో ఒక విధాన నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిసింది.
     

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement