రంజాన్...జీవితాన్ని...జీవిత గమనాన్ని పవిత్ర పరిచి మదిలోనే స్వర్గానుభూతిని కలిగించే మాసం. ఆలోచనలు, మాటలు, పనులు, నడతల్లో అల్లాహ్ ఆశించే విశాల మానవత్వం. పవిత్రత గోచరిస్తాయి. నెలవంక తొంగి చూడటంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభంకానున్నాయి.
సాక్షి సిటీబ్యూరో/చార్మినార్ : సకల శుభాల మాసం రంజాన్ ప్రారంభమైంది. సోమవారం నెలవంక దర్శనంతో ముస్లింలు ఉపవాసాలకు సమాయత్తమయ్యారు. అల్లాహ్ నెలవంకను మా కోసం, శాంతి భద్రతల కోసం ఉదయింపజేయి..ఓ దేవుడా నీవు మెచ్చే పనులన్నీ చేసే భాగ్యాన్ని అనుగ్రహించు. ఓ నెలవంకా! నీ దేవుడు, మా దేవుడు, అందరి ప్రభువు అల్లాహ్ మాత్రమే’ అని ప్రార్థించి ముస్లింలు నెలవంకను వీక్షించారు. మసీదుల్లో ఇమామ్‌లు రంజాన్ మాసాన్ని ప్రకటించారు. మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ సోదరులు పరస్పరం ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంజాన్ పవిత్ర మాసాన్ని ఆహ్వానించారు. ఉపవాస వ్రతాన్ని పాటించేందుకు కావాల్సిన నిత్యవసరాలను ముస్లింలు విరివిగా కొనుగోలు చేశారు. ఇఫ్తార్, సహర్ కోసం ముస్లింలు పెద్ద ఎత్తున ఖర్జూరం, పండ్లు కొనుగోలు చేశారు.
ప్రత్యేక ప్రార్థనలు.. దానధర్మాలు
పరమ పవిత్ర రంజాన్ మాసమంతా ఆధ్యాత్మికంగా గడుపుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనల్లో నిమగ్నమవుతారు.. రోజూ సూర్యోస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం నమాజులు, సత్కార్యాలే కాదు.. విరివిగా దాన, ధర్మాలూ చేస్తారు. ఈ నెలలో చేసే ప్రతిపుణ్య కార్యానికీ, ఆ«రాధనకు డెబ్బై రెట్ల పుణ్యం దక్కుతుందని వారి విశ్వాసం. ఐదుసార్ల నమాజ్‌లతోæపాటు రాత్రి వేళల్లో ™ రావీహ్ ప్రార్థనలుంటాయి. ఆ సమయంలో రోజూ ఖురాన్‌ను పఠించి ధ్యానిస్తారు. ఇది ప్రవక్త సూచించిన సంప్రదాయం. 30 అధ్యాయాలున్న ఖురా¯Œన్‌ను నెలలోగా పఠించాలన్న ప్రవక్త ఆదేశాన్ని తూచ తప్పకుండా పాటిస్తారు.
రంజాన్ నెలలో ఎన్నోప్రత్యేకతలు
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించి, సదా ఆచరించే దివ్య గ్రంధం ఖురాన్...ఈ మాసంలోనే అవతరించింది. ప్రవక్తలపై ఫర్మానాలు సైతం ఇదే నెలలో అవతరించాయి. అందుకే ఈ నెలకు అంత ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో సైతాను బందీ అవుతాడని..నరక ద్వారాలు మూతపడి స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. స్వర్గాన్ని చేరే అర్హతను సాధించే క్రమంలో... దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు ఈ మాసంలో ప్రారంభిస్తారు. అలా వారి జీవితం పవిత్ర ఆరాధన అవుతుంది.
రోజంతా కఠోర ఉపవాస దీక్షలు...
రంజాన్ మాసంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రోజంతా కఠోర ఉపవాస దీక్షలు కొనసాగిస్తారు. రోజుకు ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌లు చేస్తారు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు సహర్‌తో ఉపవాస దీక్షలను చేపడతారు. సూర్యస్తమయం అనంతరం ఇఫ్తార్ విందులు కొనసాగుతాయి. ఇఫ్తార్ విందులకు హిందువులను సైతం ఆహ్వానించి మతసామరస్యాన్ని చాటుకుంటారు. ఒకవైపు ఉపవాస దీక్షలు కొనసాగుతుండగానే...మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు గృహోపకర వస్తువులను ఖరీదు చేయడానికి షాపింగ్ చేస్తారు. పాతబస్తీలోని అన్ని వ్యాపార సంస్థలు సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులను డిస్కౌంట్లతో వినియోగదారులకు అందజేయడానికి సిద్ధమయ్యాయి.
సహర్‌తో షురూ..
రంజాన్ మాసం మొదటి ఉపవాస దీక్ష మంగళవారం తెల్లవారుజామున 4.20 గంటలకు సహార్‌తో ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి చారిత్రాత్మకమైన మక్కా మసీదులో ముస్లిం సోదరులు ఇషా నమాజ్ చేశారు. అనంతరం రాత్రి తరావీ సందర్భంగా ఖురాన్ పఠనం చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించు కొని రాత్రి షాపింగ్ చేయడంతో పాతబస్తీలోని వ్యాపార సముదాయాలన్ని రద్దీగా మారాయి. మంగళవారం సాయంత్రం 6.43 గంటలకు ఉపవాస దీక్షలు విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.
పాతబస్తీలో సందడి
చార్మినార్, మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్‌పురా, శాలిబండ, శంషీర్‌గంజ్ తదితర ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. సేమియా, ఖర్జూరంతో పాటు ఇతర పండ్లు ఫలాలను ఖరీదు చేయడంలో నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార సంస్థలన్నింటినీ రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. అన్ని రకాల క్రయవిక్రయాలు ప్రారంభమవడంతో పాతబస్తీ సందడిగా మారింది.
మక్కామసీదు ముస్తాబు
చార్మినార్: రంజాన్ మాసానికి మక్కా మసీదు ముస్తాబైంది. ఇప్పటికే మక్కా మసీదులో అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రంజాన్ మాసం కోసం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రూ.37 లక్షలతో మక్కా మసీదులో అభివృద్ధి పనులు చేశారు. రంజాన్ మాసంలో రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడమే కాకుండా ఇఫ్తార్ విందులు, ఖురాన్ పఠనం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు మక్కా మసీదులో ప్రతి రోజూ జరుగుతాయి. ఈ నేపథ్యంలో ముస్లింలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, జలమండలి, జీహెచ్‌ఎంసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎండ వేడిమి నుంచి కాపాడటానికి ఇప్పటికే మక్కా మసీదు ప్రాంగణంలో తాత్కాలిక షెడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ రూ.6 లక్షలను మంజూరు చేసింది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహ్మద్ ఖాసీం తదితరులు మక్కా మసీదును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రంజాన్ మాసం సందర్భంగా ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మక్కా మసీదు సూపరింటెండెంట్ మహ్మద్ అబ్దుల్ ఖదీర్ సిద్దిఖీని ఆదేశించారు.
భద్రతను కట్టుదిట్టం చేయాలి
మక్కా మసీదులో సహజంగా రోజూ పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక రంజాన్ మాసం ప్రారంభమైతే మక్కా మసీదులో ప్రతిరోజూ సందడి కనిపిస్తుంది. ఈ నేపథ్యంతో మక్కా మసీదులో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన బాంబు పేలుడు సంఘటనను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముస్లింలు కోరుతున్నారు. మక్కామసీదులో 3 డోర్ ఫ్రేం, 3 హ్యాండ్ ఫ్రేం మెటల్ డిటెక్టర్లు ఉన్నాయి. 25 మంది హోంగార్డులు విధినిర్వహణలో ఉండాల్సి ఉండగా 15 మంది హోంగార్డులు మాత్రమే రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు.
అందుబాటులో లేని సీసీ టీవీ కంట్రోల్ రూం...
గతంలో జరిగిన బాంబు పేలుడు సంఘటన అనంతరం మక్కా మసీదులో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసారు. అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు 43 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన మానిటరింగ్ రూం పని చేయడం లేదు. సీసీ కెమెరాల దృశ్యాలను మానిటరింగ్ చేయడానికి ఇప్పటి వరకు ఆపరేటర్ (టెక్నీషియన్) అందుబాటులో లేకపోవడంతో కంట్రోల్ రూంకు తాళం వేసి ఉంచారు. దీంతో అనుమానితులు, అసాంఘిక శక్తుల కదలికలను కనిపెట్టడానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరుపయోగంగా మారాయి. ఎవరు వస్తున్నారో...ఎవరు వెళుతున్నారో అప్పటికప్పుడు తెలుసుకోలేని పరిస్థితులున్నాయి.
అన్ని ఏర్పాట్లు చేశాం
మక్కా మసీదులో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. రంజాన్ మాసం ప్రారంభానికి ముందే అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యుత్, జలమండలి, జీహెచ్‌ఎంసీ విభాగాల ఆధ్వర్యంలో ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నారు. ఎండ తగులకుండా మక్కా మసీదు ప్రాంగణంలో షెడ్ ఏర్పాటు చేసాం. నిరంతరం తనిఖీల కోసం మెటల్ డిటెక్టర్లను అందుబాటులో ఉంచాం. – మహ్మద్ అబ్దుల్ ఖదీర్ సిద్దిఖీ,మక్కా మసీదు సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment