* కొనసాగుతున్న ‘స్థానిక’ క్యాంపు రాజకీయాలు
* గోవా నుంచి తిరిగొచ్చిన రంగారెడ్డి కాంగ్రెస్ జెడ్‌పీటీసీలు
సాక్షి, హైదరాబాద్ : జిల్లా పరిషత్, మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల క్యాంపు రాజకీయం ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు కావొస్తున్నా అప్పటినుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో వివిధ రాజకీయ పార్టీలు క్యాంపులు నిర్వహిస్తూనే ఉన్నాయి. సమ్మర్ క్యాంపు పేరిట ఊటీ, కొడెకైనాల్, గోవా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో మకాం వేశాయి.
క్యాంపు నిర్వహణ ఖర్చు తడిసి మోపెడవుతున్నా చైర్మన్ పీఠం కళ్లముందు కనిపిస్తుండడంతో ఎంతైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేతులెత్తేశాయి. ఫలితాలు వచ్చిన వారం, పదిరోజులపాటు శిబిరాలు నిర్వహించిన కాంగ్రెస్ పెద్దలు టీఆర్‌ఎస్ ధాటికి తట్టుకోలేక శిబిరాలు మూసేశాయి.
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 14 జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని భావించింది. జెడ్పీ చైర్మన్ రేసులో ఉన్న ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి గెలిచిన జెడ్పీటీసీ సభ్యులందరినీ సమ్మర్ క్యాంపు పేరిట గోవాకు తీసుకెళ్లారు. అయితే నాటినుంచి క్యాంపు నిర్వహణ తడిసి మోపెడుకావడం, అదే సమయంలో జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో జెడ్పీ చైర్మన్ పదవిపై కాంగ్రెస్ ఆశలు వదులుకని గోవా శిబిరం ఎత్తివేసింది. దీంతో జెడ్పీటీసీలంతా జిల్లాకు తిరుగుముఖం పట్టారు. జిల్లాలో 12 జెడ్పీటీసీలు దక్కించుకున్న టీఆర్‌ఎస్ ఎలాగైనా జెడ్పీని దక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. కాంగ్రెస్ జెడ్పీటీసీలకు డబ్బు, పదవులతోపాటు ఇతరత్రా కానుకలిస్తామని ఎరవేస్తోంది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రం క్యాంపు రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి.
అయితే ఊటీ... కాదంటే ఢిల్లీ!
Published Fri, Jun 6 2014 2:43 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM
Advertisement
Advertisement