సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు వీలుగా ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కి కొత్తగా మరో రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు ఉన్న ఐదు ప్యాకేజీల పనులకు ఎలాంటి ఆర్థిక లోటు ఉండకుండా చూసేందుకు ఈ నిర్ణయం చేసినట్లుగా తెలిసింది.ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ మొదలు ఎల్లంపల్లి వరకు చేసే పనులకు ఇప్పటికే రూ.7,400 కోట్ల టర్మ్ లోన్ ఇవ్వడానికి ఇప్పటికే ఆంధ్రాబ్యాంక్ ముందుకొచ్చి రుణాలిస్తోంది.
ఇక ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు ప్యాకేజీ 6 నుంచి ప్యాకేజీ 10 పనుల కోసం రూ.10 వేల కోట్ల రుణాలకు ప్రభుత్వం బ్యాంకులతో చర్చిస్తోంది. నాలుగు రోజుల కిందటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు చర్చలు జరిపారు. అనంతరం బ్యాంక్ అధికారులు పనులు జరుగుతున్న ప్యాకేజీల పరిధిలో పర్యటించి వచ్చారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన బ్యాంక్ అధికారులు రూ.10 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సానుకూలత తెలిపినట్లుగా తెలిసింది. ఈ రుణం తీసుకున్న పక్షంలో మొత్తంగా కార్పొరేషన్ తీసుకునే రుణం రూ.17,400 కోట్లకు చేరుతుంది.