
సాక్షి, సూర్యాపేట: టీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. అక్టోబర్ 5నుంచి కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నా రు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు గాను పలు కార్మిక సంఘాలతో కలిసి ఇప్పటికే జేఏసీగా ఏర్పడిన గుర్తింపు సంఘం టీఎంయూ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 3,067 మంది కార్మికులు పాల్గొననుండగా సుమారు 762 బస్సులు నిలిచి పోనున్నాయి... అదును చూసి దండిగా ఆదా యం వచ్చే దసరా పండుగకు మూడురోజుల ముందు కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ఇటు యాజమాన్యం తీవ్రంగా నష్టపోతుండగా.. అటు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురికానున్నారు.
ఆర్టీసీ కార్మికులు అదును చూసి దెబ్బకొట్టారు. తమ సమస్యల పరిష్కారంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యాజమాన్యం, ప్రభుత్వానికి సమ్మె రుచి చూపించనున్నారు. ఆగస్టు 30న తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, ఈనెల 3న ఎంప్లాయీస్ యూనియన్, ఈనెల 6న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఈనెల 24న గుర్తింపుసంఘం తెలంగాణమజ్దూర్ యూనియన్‌లు సమ్మె నోటీసును యాజమాన్యానికి అందించాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటు కాలం చెల్లిన వేతన సవరణతో పాటు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, గత సమ్మెకాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశాయి. లేదంటే ఈనెల 25తర్వాత ఏ క్షణమైనా నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించడంతో పాటుగా ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లతో కలిసి గుర్తింపు సంఘం టీఎంయూ ఆర్టీసీ జేఏసీగా ఏర్పడింది. అయినప్పటికీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలకు చొరవ చూపకపోవడం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో కార్మికులు గుర్రుగా ఉన్నారు. మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తుండడాన్ని గ్రహించిన ఆర్టీసీ సంఘాలు ఆదివారం సమ్మె తేదీలను ప్రకటించాయి. ఈ క్రమంలో సోమవారం రీజియన్ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని, అక్టోబర్ 5నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూలు ఏర్పడిన ఆర్టీసీ జేఏసీలోకి టీజేఎంయూ, ఎన్‌ఎంయూలను ఆహ్వానించి సమ్మెలో పాల్గొనాలని కోరారు.
దసరా పండుగకు చుక్కలే..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట డిపోల పరిధిలోని సుమారు 762 బస్సులు నడుస్తున్నాయి. ఆయా డిపోల పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 3,067 మంది కార్మికులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 10రోజుల పాటు వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల నిమిత్తం హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున స్వస్థలాలకు తిరిగి వస్తుంటారు. పండుగ సందర్భంగా ఈ బస్సులకు తోడుగా డిపోల నుంచి హైదరాబాద్‌కు ఈనెల 27నుంచే ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రోజుకు 50 సర్వీసులను అదనంగా నడుపుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ సమ్మె ప్రకటించడంతో ప్రత్యేక బస్సులతో పాటు రెగ్యులర్‌వి నిలిచిపోయి దసరా పండుగకు ఈసారి ప్రయాణికులకు చుక్కలు కన్పించనున్నాయి. సమ్మె పండుగకు ముందే కాకుండా.. తదనంతరం ఎక్కువ రోజులు కొనసాగితే జనం అవస్థలు అన్నీఇన్నీ కావు.
ఆదాయానికి భారీ గండి..
నిత్యం తీవ్ర నష్టాలో నడిచే ఆర్టీసీకి దసరా పండుగ కలిసొస్తుంది. ప్రయాణికుల భారీగా రాకపోకలు సాగించడం, పండుగ పేరుతో సంస్థ కూడా 30శాతం అదనపు చార్జీలు వసూలు చేయడంతో ఏటా భారీగా ఆదాయాన్ని పొందుతోంది. కేవలం ప్రత్యేక బస్సుల కారణంగానే 2018లో 75 లక్షల 40వేల రూపాయల అదనపు ఆదాయం సంస్థ పొందింది. రాష్ట్రంలోనే అత్యధిక ఆక్యుపెన్సీ సాధించిన రీజియన్‌గానూ నిలిచింది. మారోమారు పండుగను సొమ్ము చేసుకుందామనుకున్న సంస్థకు సమ్మె రూపంలో నష్టాన్ని మిగల్చనుంది.
సమ్మె చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వానికి, యాజమాన్యానికి గుణపాఠం చెప్పాలి. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వానికి, యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు. సమ్మె నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడం, తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహించి కాలం గడుపుతోంది. అక్టోబర్ 5 నుంచి జరిగే నిరవధిక సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి.
– బత్తుల సుధాకర్, జేఏసీ రీజియన్ కోకన్వీనర్
సమ్మెను విజయవంతం చేయాలి
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చుకునేందుకు అక్టోబర్ 5నుంచి ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలి. కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి. లేదంటే సమస్యలు ఎప్పటికీ పరిష్కారంకావు.
సుంకరి శ్రీనివాస్, టీఎంయూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment