మొయినాబాద్, న్యూస్‌లైన్: రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు, నమ్మకానికి ఆనాటి నుంచి స్వర్గీయ ఇంద్రారెడ్డి కుటుంబం కట్టుబడి ఉందని, తాను పార్టీ మారే ప్రసక్తేలేదని మాజీ హోంమంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ సబితారెడ్డి పార్టీ మారుతున్నట్లు టీవీల్లో స్క్రోలింగ్‌లు చూసి ఆందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. 14 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తనకు గౌరవం ఇచ్చిందని, తాను ఏ పార్టీలోకీవెళ్లడంలేదని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళనకు గురికావొద్దన్నారు. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ముందుగానే అందరితో చర్చిస్తానని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం రాజకీయమంతా తన చుట్టే తిరుగుతోందని, టీడీపీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే దానిలో నా ప్రమేయం ఉందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. ఎవరో ఏ పార్టీలోకో వెళితే అందులో తన ప్రమేయం ఉందనటం సరైంది కాదన్నారు.
కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
ఇచ్చిన మాట ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని, తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని సబితారెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించేందుకు కష్టపడి పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీటీడీ మాజీ సభ్యుడు కాలె యాదయ్య, నాయకులు వెంకటస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్.కృష్ణారెడ్డి, కంజర్ల భాస్కర్, మోత్కుపల్లి రాములు, దారెడ్డి కృష్ణారెడ్డి, కండిక రమేష్, పురుషోత్తంరెడ్డి, పురాణం వీరభద్రస్వామి, నర్సింహారెడ్డి, రామకృష్ణగౌడ్, ఈగ రవీందర్‌రెడ్డి, దర్శన్, రవూఫ్ పాల్గొన్నారు.
పార్టీ మారే ప్రసక్తే లేదు
Published Sun, Mar 16 2014 11:59 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement