రంగారెడ్డి: మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి‘హస్త’వ్యస్తంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. ఇక్కడి నేతల ‘చేతులు’ మాత్రం కలవడం లేదు. ఎవరికి వారే ప్రత్యేక ఎ‘జెండా’తో ముందుకు సాగడంపై పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
ఒకవైపు కొత్తగా వలసలు.. ఏళ్లుగా నియోజకవర్గాన్ని నమ్ము కుని పని చేస్తున్న లీడర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. మరోవైపు నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలతో గందరగోళం నెలకొంది.
సంక్షోభ సమయంలో పార్టీకి పెద్ద దిక్కుగా.. కార్యకర్తలకు అండగా నిలబడి.. ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఆర్థికంగా ఖర్చులు భరిస్తూ పార్టీని బలోపేతం చేస్తే.. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తమను కాదని, కొత్త నేతలకు టికెట్ కట్టబెడితే తమ రాజకీయ భవితవ్యం ఏమిటనే భావన ఆ పార్టీ నేతలను వేధిస్తోంది.
తమదైన ముద్ర వేసేందుకు..
డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి వచ్చే ఎన్ని కల్లో ఈ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఆయన మీర్‌పేట్, జిల్లెలగూడ, చంపాపేట్‌లో తరచూ పర్యటిస్తున్నారు. ఆయా కేంద్రాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్కేపురం నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన అనుభవం ఉన్న పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేప భాస్కర్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. పార్టీ నుంచి ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకే లభిస్తుందని చెబుతున్నారు.
ఈయనకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లతో పాటు మహేశ్వరం మండలంపై కొంత పట్టుంది. రాజకీయంగా మంత్రి సబితతో విభేదించి ఏడాది క్రితం బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.
బడంగ్‌పేట్, బాలాపూర్, జల్‌పల్లి కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన కొత్త మనోహర్‌రెడ్డి సైతం ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పదేళ్లుగా కేఎంఆర్ ట్రస్ట్ పేరుతో పుస్తెమెట్టెలు, నూతన వస్త్రాల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గంగా గుర్తింపు పొందిన ఆయన కూడా ఈసారి టికెట్ తనకే వస్తుందని చెబుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎల్మటి అమరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి సైతం పోటీకి సై అంటున్నారు.
ఊగిసలాటలో తీగల
గతంలో హైదరాబాద్ మేయర్‌గా, మహేశ్వరం ఎమ్మెల్యేగా పని చేసిన బీఆర్‌ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.అధికార బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేడర్‌కు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఆయన నిర్ణయాన్ని ఇటు హస్తం పార్టీ స్థానిక నేతలే కాదు.. స్వయంగా కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన కోడలు, జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి కూడా అధికార బీఆర్‌ఎస్ పార్టీని వీడి ఆయనతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.
సబితతో సవాలే..
నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో పటోళ్ల సబితారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాఽధించారు. 2009లో మొత్తం 2,86,974 ఓట్లు ఉండగా, 1,74,911 పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డికి 57,244 పోలవగా, సబిత 65,077 ఓట్లతో విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో 4,03,719 ఓట్లకు, 2,17, 299 పోలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త మనోహర్‌రెడ్డికి 42,517 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి 62,521 పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 93,305 ఓట్లతో విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు 39,445 ఓట్లు (16.84 శాతం) సాధించగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 86,254 ఓట్లు (36.82 శాతం) సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి సబితారెడ్డి 95,481 ఓట్లతో(40.76 శాతం) విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆమె కాంగ్రెస్‌ను వీడి.. అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం జిల్లా నుంచి రాష్ట్ర కేబినేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి భారీగా నిధులు తెప్పించి, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ముందున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆమెను వచ్చే ఎన్నికల్లో ‘ఢీ’ కొట్టడం కాంగ్రెస్‌కు అంత సులువు కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment