ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో బస్సులోని మహిళా ప్రయాణిలకుతో మాట్లాడుతున్న సునీతరావు
ఇబ్రహీంపట్నం: అధికారం కోల్పోయిన అక్కసుతో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై శుక్రవారం ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పథకాన్ని చాలామంది మహిళాలు వినియోగించుకుంటున్నారని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండటంతో ప్రతిపక్షాలకు అక్కసు పుట్టిందన్నారు.
ఈ పథకంపై కావాలని బీఆర్‌ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. ఆటో డ్రైవర్లను ఉసిగొల్పి రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవుతుండటంతో ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు.
ఉచిత ప్రయాణంపై మహిళలు బస్సుల్లో కొట్టుకుంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500 త్వరలో అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సదాలక్ష్మి, కవిత, ఉషశ్రీ, మాధవి, వెంకటమ్మ, మంజుల, అమృత, రత్నకుమారి, లావణ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment