ముగిసిన ‘ఎల్‌సీడీసీ’
కేశంపేట: ప్రభుత్వం 2027 వరకు కుష్టు వ్యాధి రహిత సమాజంగా మార్చేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. ఈ మేరకు మండలంలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు మార్చి 17 నుంచి 30 వరకు లెప్రసీ కేస్ డిటెక్టివ్ క్యాంపెయిన్(ఎల్‌సీడీసీ) చేపట్టింది.
ఇంటింటి సర్వే
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎనిమిది సబ్‌సెంటర్లు ఉన్నాయి. 29 పంచాయతీల పరిధిలో సుమారుగా 48 వేల జనాభా ఉంది. ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి సర్వే చేపట్టారు. ఈ సర్వేను సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు పర్యవేక్షించారు. మండల వ్యాప్తంగా 52 మంది అనుమానితులను గుర్తించి ఉన్నతాధికారులకు వివరాలు అందజేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అనుమానితులను డిప్యూటీ పారామెడికల్ అధికారి (డీపీఎంఓ), మండల వైద్యాధికారి కలిసి పరీక్షిస్తారు. వీరి పరీక్షల్లో కుష్టువ్యాధిని నిర్ధారిస్తే వారికి చికిత్సను అందిస్తారు.
లక్షణాలు
● వెంట్రుకలు, గోర్లు మినహాయిస్తే శరీరంలో ఎక్కడైనా మచ్చలు ఏర్పడతాయి.
● మచ్చలు మొద్దుబారుతాయి.
● మచ్చలు ఉన్న చోట వెంట్రుకలు ఊడిపోవడం, చమట పట్టదు.
● కనుబొమ్మల్లో వెంట్రుకలు తక్కువగా ఉంటాయి.
● నరాలు ఉబ్బెత్తుగా ఉంటాయి.
● శరీరం జిడ్డుగా మారుతుంది.
● పాదాలకు గాయాలైతే త్వరగా తగ్గకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ
వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే మందులతో తగ్గించవచ్చు. వ్యాధి లక్షణాలు బయటపడేందుకు ఏడేళ్ల సమయం పడుతుంది. వ్యాధిగ్రస్తులను పాసీ బాచిలరీ, మల్టీ బాచిలరీ రకాలుగా చికిత్సను అందిస్తారు. పాసీ బాచీలరీలో ఒక్క మచ్చ, ఒక్క నరం గుర్తిస్తే ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు చికిత్సను అందిస్తారు. మల్టీ బాచిలరీలో రెండు కంటే ఎక్కువ మచ్చలు, నరాలను గుర్తిస్తే ఏడాది నుంచి 18 నెలల వరకు చికిత్స అవసరం ఉంటుంది. చికిత్సకు అవసరమైన మందులను ప్రభుత్వం ఉచితంగానే అందిస్తోంది.
మొదట్లో గుర్తిస్తే చికిత్స సులువు
ప్రస్తుతం మండల పరిధిలో ఎవరికీ చికిత్స అందించడం లేదు. ప్రాథమిక దశలో గుర్తిస్తే మందులతో నిర్మూలించవచ్చు. ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు. శాశ్వ త వైకల్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
– డాక్టర్ నిఖిత, మండల వైద్యాధికారి, కేశంపేట
52 మంది అనుమానితుల గుర్తింపు
2027 వరకు కుష్టు వ్యాధి రహిత సమాజమే లక్ష్యం
ముగిసిన ‘ఎల్‌సీడీసీ’


