గ్రామ వాటర్‌మెన్, మేటీలను విచారిస్తున్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు
హన్వాడ (మహబూబ్‌నగర్): ‘చట్టం ఎవరికీ చుట్టం కాదు.. పోలీసులు చట్టప్రకారం తమ విధినిర్వహణ సరిగ్గా చేయకపోతే వ్యవస్థ బ్రష్టు పడుతుంది.. పోలీసుల మీద ముందే బద్నాం ఉంది.. చార్జీషీట్‌లో పేర్లు ఎందుకు నమోదు చేయలేదు.. బాధితుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్న వారిని ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదు..’ అని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు పోలీసులను ప్రశ్నించారు. మండలంలోని యారోనిపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి అరుణ్‌చంద్ర ఆత్మహత్యపై విచారణ నిమిత్తం మంగళవారం గ్రామానికి వచ్చిన ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పంచాయతీ అధికారుల తీరుపైనా అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ మినిట్స్ పుస్తకాల్లో పంచాయతీ కార్యదర్శి ప్రమేయం లేకుండా సంతకాలు, సభ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించిన ఆయన జిల్లా, మండల పంచాయతీ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తపరిచారు.
ఈ సందర్భంగా మండల ఎంపీఓ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ సుధారాణి, ఆమె భర్త అనంతరెడ్డిలను విచారించారు. అరుణ్ ఆత్మహత్యకు గల కారణాలు, విభేదాలు తదితర అంశాలపై వారి నుంచి విషయాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. అంతకుముందు ఉపాధి హామీ మేటీ మైబమ్మ, పంచాయతీ వాటర్‌మెన్ కృష్ణయ్యలను ప్రశ్నించారు. వారితో పంచాయతీ కార్యదర్శి అరుణ్ ఎలా ఉండే వారని తదితర విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. వారు సరైన సమాధానం ఇవ్వకపోడంతో కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులకు సూచించారు. వారితోపాటు సర్పంచ్ సుధారాణి, ఆమె భర్త అనంతరెడ్డి, ఎంపీఓ వెంకట్‌రెడ్డిలను పోలీసులు విచారించి వివరాలను రాబట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్‌లాల్, సోషల్ వెల్ఫేర్ డీడీ యాదయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, డీపీఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీధర్, ఎంపీపీ బాలరాజు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నటరాజు, సీఐ మహేశ్వర్, ఎస్‌ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
నిందితులను అరెస్ట్ చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జూనియర్ పంచాయతీ కార్యదర్శి అరుణ్‌చంద్రను ఆత్మహత్యకు ప్రేరేపించి ఆయన మృతికి కారణమైన నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు అన్నారు. మంగళవారం స్థానిక రెవెన్యూ హాల్‌లో అరుణ్‌చంద్ర మృతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణ్ మృతిచెంది 12 రోజులు గడిచినా ఇప్పటి దాకా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. చనిపోవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలన్నారు. గ్రామ సర్పంచ్ భర్త వేధింపులతోనే తమ కుమారుడు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని, సర్పంచ్ భర్త ఫోన్‌లో సైతం వేధించినట్లు ఫోన్ సంభాషణ రికార్డు కూడా ఉందన్నారు. వీటన్నింటిని పరిశీలించి ముందుగా బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
ప్రత్యేక బృందంతో విచారణ
కలెక్టర్ వెంకట్రావ్ అరుణ్ మృతిపై ఎస్పీతో మాట్లాడానని, ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాక్ష్యాధారాలు సేకరిస్తామని ఎస్పీ చెప్పారన్నారు. జిల్లాలో కరోనా లాకడ్‌డౌన్ ఉన్నందున విచారణలో కొద్దిగా ఆలస్యమైందని, ఇకపై జాప్యం లేకుండా తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ రెమారాజేశ్వరి మాట్లాడుతూ నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు మోహన్‌లాల్, సీతారామారావు, డీఆర్‌ఓ స్వర్ణలత, ఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు పరామర్శ..
అంతకు ముందు జిల్లా కేంద్రంలోని అరుణ్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, పద్మావతిలను కమిషన్ సభ్యుడు రాములు పరామర్శించారు. తమ కుమారుడు చాలా చురుకైన వాడని, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో చేరాడని, సర్పంచ్ భర్త వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, చట్టప్రకారం చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూస్తామని కమిషన్ సభ్యుడు రాములు వారికి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment