
సాక్షి, సిటీబ్యూరో: నగరాభివృద్ధికి గుండెకాయ లాంటిదైన ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతల చిన్న సమస్య తలెత్తినా అది ఏకంగా రాష్ట్రాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. దాదాపు 6లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్న ఐటీ కారిడార్‌లో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా లేకుంటే... అది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఐటీ కారిడార్‌తో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లోనూ సెక్యూరిటీ కత్తి మీద సామే. ఈ పరిస్థితుల్లో జనాభా అవసరాలకు సరిపడా సిబ్బంది లేకున్నా... ఓవైపు పోలీసులు, మరోవైపు సీసీ కెమెరాల డేగ కళ్లతో నేరాలను నియంత్రణ సాధ్యమవుతోంది. ఇప్పుడిదే పంథాలో భద్రత కోసం సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సరికొత్త చర్యలు తీసుకుంటున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సహకారంతో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను కొంతమందిని ఎంపిక చేసుకొని పోలీసు వలంటీర్లుగా సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ‘పోలీసు మిత్ర’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించి, సెక్యూరిటీ గార్డులను ఖాకీ దుస్తులు లేని పోలీసులుగా మార్చే ప్రక్రియను వేగిరం చేశారు. దాదాపు నెల రోజుల్లో అమల్లోకి రానున్న ఈ కార్యక్రమానికి తుదిరూపునిచ్చే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చే సెక్యూరిటీ గార్డుల వివరాలు గోప్యంగా ఉంచనున్నారు.
డేటాబ్యాంక్ ఆధారంగా..
కమిషనరేట్ పరిధిలో 125 కంపెనీలు వివిధ వ్యాపార, ఐటీ, హోటల్స్... ఇలా వివిధ సంస్థలకు భద్రతను కల్పిస్తున్నాయి. సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 18న ఆయా కంపెనీల హెడ్స్‌తో సమావేశం నిర్వహించిన సీపీ సజ్జనార్.. సెక్యూరిటీ గార్డుల నియామకం, వారి పనితీరును అంచనా వేస్తూ డేటాబ్యాంక్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రవర్తన బాగా లేకున్నా, నేర చరిత్ర ఉన్నా పక్కకు తప్పించాలని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఆయా కంపెనీల్లోని సెక్యూరిటీ గార్డులకు పోలీసులు టాక్టిక్స్, ఇంటెలిజెన్స్ అంశాల్లో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సీసీటీవీ కెమెరాల నిర్వహణ, ఫేస్ రికగ్నేషన్, నంబర్ ప్లేట్ రికగ్నేషన్ తదితర భద్రత చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. విధులు ఉన్న సమయంలో అక్కడి పరిసరాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించేలా ట్రైనింగ్ ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు కళ్లుగా వ్యవహరించాలన్న సీపీ సజ్జనార్ ఆదేశాల ప్రకారం వారు పోలీసు మిత్రలుగా వ్యవహరించనున్నారు.
ఏం చేస్తారు?
3లక్షల మంది సెక్యూరిటీ గార్డులున్నప్పటికీ వారి ప్రవర్తన, పనితీరు, వ్యక్తిగత విధానం, సైబర్ నైపుణ్యం, పోలీసులతో కలిసి పనిచేసే ఆసక్తి తదితరాలను క్రోడీకరించాకే ‘పోలీసు మిత్ర’లుగా తీసుకుంటున్నారు. వీరు ఉండే ప్రాంతాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే ఆయా సెక్యూరిటీ గార్డులుండే వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టు చేయడంతో పోలీసులు చూస్తారు. లేదంటే వారి పరిధిలోని పోలీసులకు సమాచారమిస్తే నేరుగా అక్కడికి చేరుకొని అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. అలాగే ఏదైనా ప్రమాదం, చోరీ జరిగినా... అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిసినా.. ఇలా నేరానికి సంబంధించి ఏ అంశమైనా పోలీసులకు సీక్రెట్‌గా తెలియజేస్తారు. ఆయా ప్రాంతాల్లోని మిగతా సెక్యూరిటీ గార్డులకు కూడా వీరు పోలీసు మిత్రలనే విషయం తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. పోలీసు మిత్రలకు ప్రశంస పత్రాలు, ప్రోత్సాహకాలు కూడా అందించేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే సైబర్ నేరాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ‘సైబర్ మిత్ర’ కార్యక్రమం రూపొందించిన సైబరాబాద్ పోలీసులు... ఇప్పుడు ‘పోలీసు మిత్ర’తో నేర రహిత సమాజం కోసం ముందడుగు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment