ఎండిపోతున్న వరి పంటకు నిప్పుపెట్టిన రైతులు
వెంకటాపురం : ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట.. చేతికొచ్చే దశలో ఎండిపోతుండడం చూసి తట్టుకోలేక రైతులు ఆ పంటను తగులబెట్టారు. వెంకటాపురం మండలం వె ల్తుర్లపల్లి శివారులో రామప్ప సరస్సు పరిధిలోని వీర్లకాలువ, ఒగరుకాలువ చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరందక 250ఎకరాల వరి పంట ఎండిపోయింది. పంట సాగు చేసిన వెల్తుర్లపల్లి గ్రామానికి చెందిన 20మంది రైతులు శుక్రవారం పొలాల వద్దకు చేరుకొని కన్నీరు పెట్టారు. అందులో బొడ్డు సరోజన అనే మహిళ ఎకరంలో వరి సాగుచేయగా పూర్తిగా ఎండిపోయింది. కడుపు మండిన రైతులు పంటకు నిప్పు పెట్టారు. అధికారుల నిర్లక్ష్యంతో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని ఎకరానికి రూ.300చొప్పున అధికారులకు చెల్లించామని వారు చెప్పారు. అరుునప్పటికీ అధికారులు నిధులు లేవంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. తైబందీ ఖరారు చేయకపోతే తాము పంటలు వేసేవారముకాదని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. జరిగిన పంట నష్టానికి అధికారులే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.