వారి రూటే సెపరేటు.. | farmer labarors coming from west bengal for corp work | Sakshi
Sakshi News home page

వారి రూటే సెపరేటు..

Published Mon, Sep 4 2017 12:26 PM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

వరినాట్లు వేస్తున్న బెంగాలీ కూలీలు - Sakshi

వరినాట్లు వేస్తున్న బెంగాలీ కూలీలు

వరినాట్లు వేసేందుకు బెంగాలీ కూలీలు రాక
ఏటేటా వారికి పెరుగుతున్న డిమాండ్‌
కూలీల కొరత తీరుతుందంటున్న రైతులు


కొత్తొక వింత.. పాతొక రోత అనే నానుడిని అందరూ వింటుంటారు. ఇక్కడ కొత్త విధానం వింతగా కంటే లాభాలను తెచ్చి పెడుతుండడంతో ఆ విధానానికే రైతులు మొగ్గు చూపుతున్నారు. మన ప్రాంత వాసులు వేసే వరినాట్ల కంటే పశ్చిమబెంగాల్‌ కూలీలు వేస్తున్న వరినాట్లు దిగుబడులు పెంచుతుండడంతో వారితో వరినాట్లు వేయించుకునేందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఏటేటా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం నుంచి జిల్లాకు వరినాట్లు వేసేందుకు వస్తున్న కూలీల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

మూడేళ్లుగా..
పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన కూలీలు వరినాట్లు వేసే విధానాన్ని గమనించి 2015లో ఖరీఫ్‌లో కొందరు రైతులు అక్కడి వారిని వరినాట్లు వేసేందుకు ఇక్కడకు తీసుకుని వచ్చారు. వారు వేసే వరినాట్లు  శ్రీవరిసాగు, డ్రమ్‌సీడర్‌ విధానాలను పోలి ఉండడం గమనార్హం. ఒక లైనుగా మూనకు మూనకు దూరంగా వరినాట్లు వేస్తున్నారు. మన కూలీలు వరినాట్లు వేసే సమయంలో కుదురుకు అధికంగా వరినారును వినియోగిస్తారు. దీని వలన ఎకరానికి 70 వరి పోగులను వినియోగిస్తుంటే, వెస్ట్‌బెంగాల్‌ కూలీలు కేవలం 30 వరి పోగులను వినియోగిస్తున్నారు. దీని వలన వరినారు విషయంలో కూడా పెట్టుబడి తగ్గుతుందని రైతులు పేర్కొంటున్నారు.  

రైతులకు డబుల్‌ ధమాకా..
జిల్లాలో రైతులు వ్యవసాయ కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. పశ్చిమబెంగాల్‌ నుంచి కూలీలు రావడంతో రైతులకు రెండు విధాలుగా మేలు కలుగుతుంది. ఒకటి కూలీల కొరత తీరడంతో పాటు, పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఇక్కడి కూలీలతో వరినాట్లు వేయిస్తే ఎకరాకు రూ.5 వేలు ఖర్చు కాగా, అక్కడి కూలీలతో వరినాట్లు వేయిస్తే ఎకరాకు రూ.3,500 అవుతుంది.
 
వరి నాట్లు వేసేది మగ కూలీలే..
మన ప్రాంతంలో మహిళా కూలీలు మాత్రమే వరి నాట్లను వేస్తుంటారు. పురుష కూలీలు వరినారును లాగుతారు. వెస్ట్‌బెంగాల్‌ నుంచి వచ్చిన మగ కూలీలు మాత్రమే వరినాట్లు వేయడం గమనార్హం. వరినారును చేతబట్టి చకచకా వరినాట్లు వేస్తున్న విధానం ఈ ప్రాంత రైతులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

పొట్టకూటి కోసం..
వరినాట్లు వేయడానికి తెలిసిన వ్యక్తి ద్వారా పొట్టకూటి కోసం వచ్చాం. మా గ్రామంలో వ్యవసాయ పనులు చాలా తక్కువగా ఉంటాయి. వ్యవసాయేతర పనులు చేయాలంటే కలకత్తా వెళ్లాల్సిందే. – నవ్‌బిందు, బెంగాలీ కూలీ

ఈ ఏడాదే వచ్చాం..
మేము ఈ ఏడాదే ఇక్కడకు వచ్చాం. గతేడాది మా పక్క మండలం నుంచి ఇక్కడకు వచ్చారు. విషయం తెలుసుకుని ఈ ఏడాది మేము వచ్చాం. ఇక్కడ పనులు ఎక్కువగా ఉండడంతో ఉపాధి దొరుకుతుంది.   – దీపాంగల్‌ మండల్, బెంగాలీ కూలీ

కూలీ గిట్టుబాటవుతుంది..
అక్కడితో పోలిస్తే కూలీ గిట్టుబాటవుతుంది. ప్రస్తుతం మాకు పనులు లేకపోవడంతో ఇక్కడకు వచ్చాం. కాంట్రాక్టుకు తీసుకుని పనులు చేస్తున్నాం. రోజుకు రూ.700వరకు గిట్టుబాటవుతుంది. – సృపథ్‌ మేస్త్రి, బెంగాలీ కూలీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement