వరికి ‘మద్దతు’ సగమే
- రాష్ట్రం వరికి అడిగింది 3,118 కేంద్రం ఇచ్చింది రూ.1,470
- వరితోపాటు పత్తికి గతేడాది కంటే రూ.60 మాత్రమే పెంపు
- పెట్టుబడులు, సాగు ఖర్చుల్ని పట్టించుకోని కేంద్రం
సాక్షి, హైదరాబాద్: వరికి కనీస మద్దతు ధరగా సాధారణ రకానికిరూ. 1,470, ఏ గ్రేడ్ వరికి రూ.1,510 ఖరారు చేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2016-17 ఖరీఫ్‌కు సంబంధించి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)లను కేంద్రం ప్రకటించింది. గతేడాది కంటే వరికి కేవలం రూ.60 మాత్రమే పెంచడం విమర్శలకు దారితీసింది. మొక్కజొన్నకు గతేడాది కంటే క్వింటాకు రూ.40 పెంచి రూ. 1,365 ఖరారు చేసింది. సోయాబీన్‌కు గతేడాది రూ. 2,600 ఎంఎస్‌పీ ఉండగా... ఇప్పుడు రూ.2,775 ఖరారు చేసింది. అంటే రూ. 175 పెంచిందన్నమాట. పత్తికి కూడా గతేడాది కంటే రూ. 60 మాత్రమే పెంచింది. పత్తికి గ్రేడ్‌లనుబట్టి రూ.3,860, రూ.4,160 చొప్పున ఖరారు చేసింది.
ఎకరా వరికయ్యే ఖర్చు రూ.45,200
ఎకరా విస్తీర్ణంలో వరి పండించాలంటే అయ్యే ఖర్చు అక్షరాలా రూ.45,200. సాగు సహా ఇతర అన్ని ఖర్చులను లెక్కలోకి తీసుకొని తెలంగాణ సర్కారు గతేడాది ఈ లెక్కగట్టింది. ఆ ప్రకారం క్వింటా వరి పండించాలంటే రైతుకు అయ్యే ఖర్చు రూ. 2,079గా తేల్చింది. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం అందుకు 50 శాతం అదనంగా కలిపి 2016-17 ఖరీఫ్‌లో వరికి ఎంఎస్‌పీ రూ. 3,118 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఢిల్లీలో నాలుగు నెలల కిందట జరిగిన వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మద్దతు ధరలకు సంబంధించి సమగ్ర నివేదికను కేంద్రానికి అందజేసింది.
వరితో పాటు మొక్కజొన్న, కంది, పెసర, సోయాలకు కూడా రైతుకు అయ్యే ఖర్చును, ఎంఎస్‌పీని నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అలాగే పత్తి సాగు, ఇతర ఖర్చులు క్వింటాకు రూ.5,395 అవుతుందని, ఈ పంటకు మద్దతు ధరగా రూ. 8,092 ఇవ్వాలని కోరింది. మొక్కజొన్న క్వింటా సాగు ఖర్చు రూ. 1,883 అవుతుందని... మద్దతు ధరగా రూ. 2,824 కావాలని కోరింది. సోయాకు సాగు ఖర్చు క్వింటాకు రూ. 3,157 అవుతుందని... మద్దతు ధర రూ. 4,731 ఇవ్వాలని కోరింది. ఈ రకంగా ఎంఎస్‌పీ ఇస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని... లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ గోడును కేంద్రం లెక్కచేయలేదు.
మద్దతు ధరపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉండాలి
మద్దతు ధరలను కేంద్రం నిర్ణయించడం సరికాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సాగు, పెట్టుబడి ఖర్చులుంటాయి. స్థాని కంగా ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు ఇంకో విధంగా ఉంటాయి. కాబట్టి మద్దతు ధరలను దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా కేంద్రం నిర్ణయించడం సమంజసం కాదు. సీఏసీపీ సమావేశంలో వరికి మద్దతు ధర రూ. 3 వేలకు పైగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవిస్తే కేంద్రం మాత్రం కేవలం రూ. 1,470కే పరిమితం చేయడం అన్యాయం.
- సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షుడు