సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఆదివారం నిర్వహించిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) తెలుగు మీడియం పోస్టుల రాత పరీక్షకు పలు కేంద్రాల్లో 100 శాతం హాజరు నమోదైంది. మిగతా కేంద్రాల్లో 91 నుంచి 97.4 శాతం హాజరు రికార్డయింది. మరోవైపు ఇంగ్లిష్ మీడియం ఎస్‌జీటీ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షకు 97 నుంచి 99 శాతం హాజరు నమోదైంది.
రెండో రోజూ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తెలుగు మీడియం పరీక్షను హెచ్‌ఎండీఏ పరిధిలో 86 కేంద్రాల్లో నిర్వహించినట్లు పేర్కొంది. ఇంగ్లిష్ మీడియం ఎస్‌జీటీ పరీక్షను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 38 కేంద్రాల్లో నిర్వహించినట్లు వెల్లడించింది. పరీక్షలను టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ సెంటర్ నుంచి చైర్మన్ ఘంటా చక్రపాణి, అధికారులు పర్యవేక్షించగా, 7 ప్రత్యేక బృందాలు వివిధ పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి.
నేడు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు..
స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టుల భర్తీకి నేడు (26న) కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షను (సీబీఆర్‌టీ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎస్‌ఏ ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంగ్లిష్ మీడియం ఎస్‌ఏ మ్యాథ్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం పరీక్షకు హెచ్‌ఎండీఏ పరిధిలోని 10 కేంద్రాల్లో 6,985 మంది, మధ్యాహ్నం పరీక్షలకు 5 కేంద్రాల్లో 4,912 మంది (మ్యాథ్స్‌కు 2,519, సోషల్ స్టడీస్‌కు 2,393 మంది) హాజరు కానున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment