ఆసరా అందక రాలిన పండుటాకులు | Six old men commit suicide not to get pension | Sakshi
Sakshi News home page

ఆసరా అందక రాలిన పండుటాకులు

Published Sun, Dec 14 2014 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

Six old men commit suicide not to get pension

ఒకరు ఆత్మహత్య : ఆరుగురు మృతి  
 సాక్షి నెట్‌వర్క్: పింఛన్ రాలేదని మనస్తాపం చెంది నల్లగొండ జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు వృద్ధులు మరణించారు. నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగా ల గ్రామానికి చెందిన జూకూరి లింగయ్య(60) మానసిక వికలాంగుడు. ఏ ఆసరా లేని లింగయ్య  పింఛన్ కోసం దరఖాస్తు చేసుకో గా, మంజూరు కాలేదు. మనస్తాపం చెంది శుక్రవారం క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా, శనివారం చనిపోయా డు. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం హరి పురం గ్రామానికి చెందిన తుమ్మల పెద్ద రాజయ్య(70) పేరు జాబితాలో లేకపోవడంతో కలత చెందాడు. నాలుగు రో జులు ఆహారం మానేసిన రాజయ్య శనివారం మృతి చెందాడు.

ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేటకు చెందిన ఎండీ హైదర్ అలీ (70)కి  గతం లో పింఛన్ వచ్చేది. కొత్త జాబితాలో పేరు లేకపోవడంతో మనో వేదనకు గురై, శనివారం మరణించాడు. సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన రావుల లచ్చమ్మ(84)కు కూడా పింఛన్ వచ్చేది. ప్రస్తుతం ఆసరా అందకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైంది. శనివారం  మృతి చెందింది. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపా డు శివారు కొత్త తండాకు చెందిన నూనావత్ బిక్షం(90) పేరు పింఛన్ జాబితాలో లేకపోవడంతో ఎలా బతకాలని ఆలోచిస్తూ శుక్రవా రం రాత్రి చనిపోయాడు.
 
మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన దారం చిన్ననాగయ్య(70)కు పిం ఛన్ వచ్చేది.  జాబితాలో పేరు లేదని తెలుసుకొని బెంగపెట్టుకున్నాడు. శనివారం ఇంటి ముందు కూర్చొని ఆలోచిస్తూ ప్రాణాలు వది లాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన మంగలి శివరాములు(65) కుమార్తె సాయమ్మ (25) మానసిక వికలాంగురాలు. గతంలో ఈమెకు పింఛన్ వచ్చేది.   ప్రస్తుత జాబితాలో కుమార్తె సాయమ్మ పేరులేదు. దీనికి  తోడు శివరాములు కూడా ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. సదరం క్యాంపులకు వెళ్లినా వికలాంగ ధ్రువీకరణ రాలేదు. దీంతో నిరాశలో ఉన్నాడు. తాజాగా,  పింఛన్ జాబితాలో కుమార్తె పేరు లేదని కలత చెందాడు. వికలాంగురాలైన కుమార్తెను ఎలా పోషించాలో తెలియక మనోవేదనతో గుండె పోటుకు గురయ్యాడు.
 
పింఛన్ కోసం అన్నపానీయాలు బంద్

రెండు రోజులుగా వృద్ధురాలి నిరసన
ఆందోళనలో కుటుంబ సభ్యులు

 
 తూప్రాన్: ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా అందిస్తున్న పింఛన్ జాబితాలో తన పేరు లేదని ఓ వృద్ధురాలు రెండు రోజులుగా అన్నపానీయాలు మానేసి నిరసన తెలుపుతోంది. మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన పిట్ల పోచమ్మ (85) వితంతువు. కాగా.. అప్పులబాధతో పన్నెండేళ్ల క్రితం కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అత్త, కోడళ్లు వితంతు పింఛన్ తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా వృద్ధులకు, వితంతువులకు రూ.1000 అంది స్తున్న విషయం తెలిసిందే.
 
 ఈ క్రమంలో శుక్రవారం గ్రామ పంచాయతీ వద్ద వీఆర్‌ఓ అరుణ గ్రామానికి చెందిన అర్హుల జాబితా అతికిం చింది. అందులో గ్రామానికి చెందిన 09 మంది కి చెందిన వితంతువుల పేర్లు లేవు. విషయం తెలుసుకున్న పిట్ల పోచమ్మ తనకున్న ఒక్క ఆసరా రాకుండా పోయిందని బాధపడుతూ శుక్రవారం నుంచి అన్నపానీయాలు మానేసింది. కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా ఏమీ తీసుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శి పింఛన్లు రాని వారికి తిరిగి వచ్చే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినా వృద్ధురాలు మాత్రం అన్నపానీయాలు ముట్టుకోవడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.  
 
 ఉధృతంగా పింఛన్ పోరు
 వరంగల్:  జిల్లావ్యాప్తంగా పింఛన్ పోరు ఉ దృతమైంది. అర్హులైన తమకు పింఛన్లు అందజేయూలని పలు ప్రాంతాల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆందోళన చేపట్టారు. హసన్‌పర్తి మండలం దేవన్నపేట శివారులోని సుబ్బయ్యపల్లిలో ఎల్.శంకరయ్య అనే వృద్ధు డు శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు యత్నిం చాడు. దరఖాస్తులు తిరస్కరించడంపై దరఖాస్తుదారులు నిరాహార దీక్ష చేపట్టారు. ఖానాపురం మండలంలోని మంగళవారిపేటలో వికలాంగులు రాస్తారోకో నిర్వహించారు. కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పల్లగుట్ట లో జీపీ ఎదుట నిరసన తెలిపారు.
 
పిల్లలకూ పింఛన్లు!
మహబూబ్‌నగర్ జిల్లాలో పింఛన్ల మంజూరులో గందరగోళం
గట్టు: వృద్ధులకు రావాల్సిన పింఛన్లు పిల్లలకు మంజూరయ్యాయి. తాము అర్హులం మొర్రో.. పింఛన్లు ఇవ్వండని వేలాదిమంది వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా మంజూరుకాని పింఛన్లు పిల్లల పేరిట మంజూరు కావడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది.  మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డి గ్రామంలో కొత్తగా 226 మందికి వృద్ధాప్య, వితంతు, చేనేత కార్మికులకు సంబంధించిన పింఛన్లను అధికారులు మంజూరు చేశారు. అయితే ఈ జాబితాలో ఉన్న వరుస సంఖ్య 03 నాగప్ప, 30 ఈడిగ నాగప్ప, 110 జాబితాలో సాకలి ఈరమ్మల పేర్లపై ఇద్దరికి వృద్ధాప్య, ఒకరికి చేనేత పింఛన్ మంజూరైంది. ఈ పేర్లతో గ్రామంలో వృద్ధులు, చేనేత కార్మికులు ఉన్నారు. అయితే, జాబితాలో మాత్రం పిల్లల పేర్ల వద్ద వారి ఫొటోలే ఉండడంతో అవి పిల్లలకు ఎలా మంజూరు చేశారోనని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జరిగిన పొరపాట్లపై అధికారులు విచారణ చేయించే పనిలో ఉన్నారు.
 
పింఛన్ కోసం వెళ్లి.. కోమాలోకి..
కిందపడిన వృద్ధుడు ఆపరేషన్ కోసం రూ. 3 లక్షలు
అవసరమన్న వైద్యులు సాయం కోసం ఎదురుచూపు

 
 సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చిన్నలింగాపూర్ గ్రామానికి చెందిన పండుగ బాలయ్య(70)కు పింఛన్ వచ్చిన ఆనందం అరగంట కూడా నిలువలేదు. మొన్నటిదాకా పింఛన్ వస్తుందో లేదోనని ఆందోళన చెందిన బాలయ్య జాబితాలో పేరు రావడంతో ఎంతో ఆనందించాడు. రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీ వద్దకు వెళ్లి రెండు నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులు రూ. 2వేలు తీసుకున్నాడు. ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై కాలుజారి పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో పాటు మెదడులో రక్తం గడ్డకట్టడంతో కోమాలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్‌కు రూ. 3లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఆపరేషన్ చేసినా ప్రాణానికి హామీ ఇవ్వలేమని చెప్పడంతో బాలయ్య కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీస్తున్నారు. బాలయ్య భార్య రామవ్వ గతంలోనే మరణించగా, కొడుకు నర్సయ్య జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వె ళ్లాడు. ఇద్దరు కూతుళ్లు బాలవ్వ, పోశవ్వ ఉన్నారు. ప్రస్తుతం కోమాలో ఉన్న బాలయ్యను బిడ్డలే చూసుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి బాలయ్యకు వైద్య సహాయం అందించాలని ఆ కుటుంబం కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement