రూ. 700 కోట్లతో ‘స్కైవర్త్‌’ ప్లాంట్‌ | Skyworth To Invest 700 Crore In Hyderabad | Sakshi
Sakshi News home page

రూ. 700 కోట్లతో ‘స్కైవర్త్‌’ ప్లాంట్‌

Published Sat, Nov 30 2019 3:03 AM | Last Updated on Sat, Nov 30 2019 3:03 AM

Skyworth To Invest 700 Crore In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ స్కైవర్త్‌ సిద్ధమవుతోంది. మొదటి దశలో రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావుతో స్కైవర్త్‌ గ్రూప్‌ చైర్మన్‌ లై వీడ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయింది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్‌ బ్రాండ్‌... ఎల్‌ఈడీ టీవీలను ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్‌ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లను తయారు చేయాలని స్కైవర్త్‌ నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్‌ రంగానికి సంబంధించి దేశంలోకెల్లా భారీ చైనా పెట్టుబడుల్లో ఒకటిగా దీనిని పరిశ్రమశాఖ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

5 వేల మందికి ఉపాధి
స్కైవర్త్‌ పెట్టుబడులతో రాష్ట్రంలో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. టీఎస్‌ ఐపాస్‌ వంటి విప్లవాత్మక పారిశ్రామిక అనుకూల విధానాలతో అనేక కంపెనీల పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోందన్నారు. నైపుణ్యం గల మానవవనరులతోపాటు శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమాన, రవాణా సౌకర్యాలు తదితరాల మూలంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. స్కైవర్త్‌ భారీ పెట్టుబడులతో భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయి: లీ వైడ్‌ 
ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయని స్కైవర్త్‌ చైర్మన్‌ లై వీడ్‌ తెలిపారు. అత్యుత్తమ నాణ్యతగల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ పనిచేస్తుందన్నారు.

తమ సంస్థ కార్యకలాపాలకు భారత్‌ వ్యూహాత్మక మార్కెట్‌ అని, స్కైవర్త్‌ నాణ్య త, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులు  వినియోగదారుల ఆదరణ పొందినట్లు స్కైవర్త్‌ ఉపాధ్యక్షుడు వాంగ్‌ జెంజున్‌ తెలిపారు. సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విభా గం డైరక్టర్‌ సుజయ్‌ కారంపురి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ ఈ.వి.నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement