రాజీవ్ స్వగృహను అమ్మేశారు..!
నల్లగొండ, న్యూస్‌లైన్, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక స్థోమతకు అనుగుణంగా సకల సౌకర్యాలతో వివిధ మోడళ్లలో ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ.. 2008 ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకేంద్రం శివారు పోలీస్ బెటాలియన్ వద్ద ‘రాజీవ్ స్వగృహ’ పేరుతో స్కీంను ప్రారంభించింది. స్వగృహ ప్రారంభిం చిన నాటినుంచి అనేక సమస్యలు చుట్టుము ట్టాయి.నల్లగొండకు పది కిలోమీటర్ల దూరంలో ఉండడం, నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వంటి అనుమానాలు అప్పట్లో లబ్ధిదారుల్లో తలెత్తాయి. దీంతో లబ్ధిదారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో పాటు ప్రభుత్వమూ ఇళ్ల నిర్మాణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపలేదు.
నీరుగారిన లక్ష్యం...
ఇంటి నిర్మాణం, స్థలాన్ని బట్టి ఒక్కో ఇల్లు రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ధర నిర్ణయించారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో 317 ఫ్లాట్స్ నిర్మాణం చేపట్టారు. స్వగృహ ప్రారంభ దశలో ఇళ్లు కొనేందుకు 1200 మంది దరఖాస్తు చేశారు. కానీ ఇంటి నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో మరుసటి ఏడాదికి వచ్చేసరికి దర ఖాస్తుదారులు 458 మందికి చేరారు. వీరంతా ఇళ్లు కావాలని కోరుతూ ఒక్కొక్కరు సభ్యత్వం కింద రూ.3 వేలు చెల్లించారు.
అప్పటికీ ఇంటి నిర్మాణాలు పూర్తికాకపోవడం, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 155మంది తాము చెల్లించిన సభ్యత్వాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా దరఖాస్తు చేశారు. కానీ ప్రభుత్వం నయాపైసా చెల్లించలేదు. మిగిలిన 304 మంది దరఖాస్తుదారులు ఇంటి నిర్మాణ వ్యయంలో 15నుంచి 25శాతం వరకు ముందుగానే సొమ్ము చెల్లించారు. అధికారుల లెక్కల ప్రకారం దరఖాస్తుదారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల సొమ్ము తిరిగి చెల్లిస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు.
పరిస్థితి ఇదీ...
ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న సమయంలోనే విద్యుత్, తాగునీటి సరఫరాకు సంబంధించిన వసతులు కల్పించాల్సి ఉంది. ఆ మేరకు రాజీవ్ స్వగృహ వారు రూ.60 లక్షలు ఆయా శాఖలకు చెల్లించారు. కానీ వారు త్వరితగతిన పనులు చేపట్టలేదు. లబ్ధిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ప్రభుత్వం సొంత నిధులతో నిర్మాణాలు చేపట్టలేకపోయింది.
ఆర్థికంగా నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో రాజీవ్ స్వగృహ నిర్మాణం చేపట్టిన శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి (ఎస్వీఈసీ) మూడేళ్లకు పైగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా నిలిపేసింది. దీంతో మూడేళ్లనుంచి స్వగృహ ఎస్టేట్‌లో మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. ఇలా అన్ని వైపులనుంచి సమస్యలు చుట్టుముట్టడంతో మరో గత్యం తరం లేక ప్రభుత్వం స్వగృహ ఆస్తులను అమ్మేసింది.
చకాచకా నిర్ణయాలు...
జిల్లాలో నల్లగొండతో పాటు, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేటలో కూడా రాజీవ్ స్వగృహ నిర్మాణాల కోసం భూములు సేకరించారు. అయితే సూర్యాపేటలో మినహా భువనగిరిలో 121 ఎకరాలు, మిర్యాలగూడ 60 ఎకరాల భూములు సేకరించారు. కానీ, సర్వేలు పూర్తికాలేదు. దీంతో రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికారంలోకి వచ్చే కొత్త సర్కారు స్వగృహ ఆస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటోదనన్న ఉద్దేశంతో.. సర్వే చేసిన భూములను వెంటనే రాజీవ్ స్వగృహ మీదకు మార్పిడి చేయమని ఆదేశిస్తూ రెండు రోజుల క్రితం జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి.
రూ. 12లక్షలు చెల్లించాం : విజయలక్ష్మి, కొనుగోలుదారు
స్వగృహలో రెండు ఇళ్ల కోసమని రూ.12 లక్షలు చెల్లించి మూడేళ్లైంది. డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగితే ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ అధికారులను సంప్రదిస్తే భూములను అమ్ముతున్నామని, వాటి అమ్మకం పూర్తిగానే డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు చెల్లించలేదు. కొత్త ప్రభుత్వంలో ఇళ్లు కట్టిస్తామని మరోమారు చెప్పారు. డబ్బుల కోసం వెళ్లినప్పుడల్లా ఏదో ఒక సాకుతో చెప్పి పంపిస్తున్నారు.