
పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
మెదక్: తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి తెలిపారు. గురువారం మెదక్‌లో విలేకరులతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని పర్యాటక రంగం కుంటుపడిందన్నారు. ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఆలయాలు కూడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రస్తుతం ఆలయాల అభివృద్ధితో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తొలుత రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను గుర్తిస్తున్నామన్నారు. విద్యార్థులు అన్ని పర్యాటక కేంద్రాలను వీక్షించేందుకు వీలుగా వారికి రాయితీలు ఇస్తామన్నారు. టూరిజం బస్సుల చార్జీల్లో విద్యార్థులకు 30 శాతం రాయితీ ఇవ్వడంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తామని రమణాచారి వెల్లడించారు.